Indian national arrested: జాంబియాలో భారీగా నగదు, బంగారంతో భారతీయుడి అరెస్ట్

Indian Citizen Arrested in Zambia with Millions in Cash and Gold
  • 17 కోట్ల విలువైన డాలర్ నోట్లు, బంగారు కడ్డీలు స్వాధీనం
  • దుబాయ్ వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్ కు..
  • అధికారుల తనిఖీలలో బయటపడ్డ డాలర్లు, బంగారం
భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని అక్రమంగా దుబాయ్ తరలించేందుకు యత్నించిన ఒక భారతీయ పౌరుడిని అరెస్టు చేసినట్లు జాంబియా కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. కెన్నెత్ కౌండా అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడి నుంచి సుమారు రూ. 17 కోట్లకు పైగా విలువైన అమెరికన్ కరెన్సీ, సుమారు 5 లక్షల డాలర్ల విలువచేసే బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
 
జాంబియా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దుబాయ్ వెళ్లేందుకు 27 ఏళ్ల భారతీయ పౌరుడు భారీ లగేజీతో కెన్నెత్ కౌండా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వచ్చాడు. ఈ క్రమంలో విమానాశ్రయంలోని అధికారుల బృందం తనిఖీలు నిర్వహించగా, అతడి వద్ద భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ, బంగారం బయటపడిందని జాంబియా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిషన్ (డీఈసీ) తెలిపింది. 23.2 లక్షల డాలర్ల (సుమారు రూ.17.07 కోట్లు) నగదు, 5 లక్షల డాలర్ల (సుమారు రూ.4.17 కోట్లు) విలువ చేసే ఏడు బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు డీఈసీ పేర్కొంది. 

నగదు మొత్తం 100 డాలర్ల నోట్ల రూపంలో ఉంది. ఈ నోట్ల కట్టలను రబ్బర్ బ్యాండ్లతో కట్టి, ఒక నల్ల బ్యాగులో ఉంచి, ఆ బ్యాగును మరో పెద్ద సూట్‌కేస్‌లో పెట్టి తరలించేందుకు నిందితుడు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని డీఈసీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని డీఈసీ అధికారులు హెచ్చరించారు.
 
దక్షిణాఫ్రికా దేశమైన జాంబియాలో రాగి, బంగారం వంటి ఖనిజ నిల్వలు సమృద్ధిగా ఉన్నప్పటికీ, దేశ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం.. దేశ జనాభాలో 60 శాతానికి పైగా ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు. కాగా, గత ఏడాది కూడా జాంబియాలో ఆయుధాలు, 127 కిలోల బంగారం, 5.7 మిలియన్ డాలర్ల నగదుతో ప్రయాణిస్తున్న విమానంతో సహా ఐదుగురు ఈజిప్షియన్లను అరెస్టు చేసిన ఉదంతం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే, వారిపై మోపిన గూఢచర్యం ఆరోపణలను ప్రాసిక్యూటర్లు ఉపసంహరించుకోవడంతో వారు విడుదలయ్యారు. తాజా ఘటనతో విమానాశ్రయంలో నిఘా మరింత కట్టుదిట్టం చేశారు.
Indian national arrested
Zambia
Kenneth Kaunda International Airport
Smuggling
Gold
US Dollars
Money Laundering
Drug Enforcement Commission
International crime

More Telugu News