Mohammed Azeem: పెళ్లి పీటలపై వధువుకు బదులుగా ఆమె తల్లి.. వరుడి షాక్!

- ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘటన
- పెళ్లి కుమార్తె పేరుకు బదులుగా ఆమె తల్లి పేరును మౌల్వీ పిలవడంతో అనుమానం
- ముసుగు తొలగించి చూసి నిర్ఘాంతపోయిన పెళ్లికొడుకు
- అల్లరి చేస్తే రేప్ కేసు పెడతామని బెదిరించిన వరుడి అన్నావదినలు
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అలీగఢ్‌లో ఓ మహిళ కాబోయే అల్లుడితో పరారు కాగా, బుదౌన్‌లో వియ్యంకుడితో వియ్యపురాలు వెళ్లిపోయింది. తాజాగా, మీరట్‌లో పెళ్లి పీటలపై వధువుకు బదులుగా ఆమె తల్లి కనిపించడంతో వరుడు నిర్ఘాంతపోయాడు.
పోలీసుల కథనం ప్రకారం.. బ్రహ్మపురికి చెందిన మొహమ్మద్ అజీం (22)కు శామలీ జిల్లాకు చెందిన మంతశా (21)తో వివాహం నిశ్చయమైంది. నిఖా సందర్భంగా మౌల్వీ వధువు పేరును ‘తాహిరా’ అని పిలవడంతో వరుడికి అనుమానం వచ్చింది. వెంటనే ముసుగు తొలగించి చూసి షాక్ అయ్యాడు. మంతశాకు బదులుగా భర్త చనిపోయిన ఆమె తల్లి (45) వధువు వేషంలో కనిపించడంతో నిర్ఘాంతపోయాడు.
తన తరపున పెద్దలుగా వ్యవహరించిన అన్నావదినలే వధువు కుటుంబంతో కుమ్మక్కై ఈ దారుణానికి తెగబడినట్టు తెలుసుకుని విస్తుపోయాడు. అల్లరి చేస్తే అత్యాచారం కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని వారిద్దరూ అజీంను బెదిరించారు. దీంతో తాను మోసపోయినట్టు గ్రహించిన అజీం పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లి కోసం తాను రూ. 5 లక్షలు ఖర్చు చేశానని వాపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.