Nikku Madhusudhan: భూమికి 120 కాంతి సంవత్సరాల దూరంలో జీవం.... కనుక్కున్నది మనోడే!

Life Discovered 120 Light Years Away Indian Scientists Breakthrough
  • భూమికి 120 కాంతి సంవత్సరాల దూరంలోని K2-18b గ్రహం
  • తాజాగా K2-18b గ్రహంపై డైమిథైల్ సల్ఫైడ్ (DMS) అణువు గుర్తింపు
  • భారత సంతతి ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ నిక్కు మధుసూదన్ బృందం ఆవిష్కరణ
విశ్వంలో భూమి మాత్రమే జీవానికి ఆవాసమా? లేక సుదూర గ్రహాలపై కూడా జీవం ఉందా? అనే అన్వేషణలో కీలక ముందడుగు పడింది. భూమికి 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న K2-18b అనే గ్రహంపై జీవం ఉనికికి బలమైన సంకేతంగా భావించే డైమిథైల్ సల్ఫైడ్ (DMS) అనే అణువును శాస్త్రవేత్తలు గుర్తించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన భారత సంతతి ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ నిక్కు మధుసూదన్ నేతృత్వంలోని బృందం ప్రతిష్టాత్మక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) సాయంతో ఈ అసాధారణ ఆవిష్కరణ చేసింది.

భూమిపై, డైమిథైల్ సల్ఫైడ్ (DMS) ప్రధానంగా సముద్రపు పాచి వంటి సూక్ష్మజీవుల జీవక్రియల ఫలితంగా మాత్రమే ఉత్పత్తి అవుతుంది. గంధకం, కార్బన్, హైడ్రోజన్‌లతో కూడిన ఈ అణువు K2-18b వాతావరణంలో కనుగొనడం, ఆ గ్రహంపై జీవం ఉండే అవకాశాలకు బలమైన సూచికగా పరిగణిస్తున్నారు. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ 'ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్' లో ప్రచురితమయ్యాయి.

"ఇప్పుడే జీవాన్ని కనుగొన్నామని చెప్పడం తొందరపాటే అవుతుంది" అని డాక్టర్ మధుసూదన్ ఒక సమావేశంలో స్పష్టం చేశారు. "అయితే, మా పరిశీలనలకు అత్యుత్తమ వివరణ ఏమిటంటే, K2-18b వెచ్చని సముద్రంతో నిండి, జీవంతో కళకళలాడుతూ ఉండవచ్చు" అని ఆయన అన్నారు. "ఇది ఒక విప్లవాత్మక క్షణం. మానవాళి నివాసయోగ్యమైన మరో గ్రహంపై జీవ సంకేతాలను చూడటం ఇదే తొలిసారి" అని అభిప్రాయపడ్డారు.

K2-18b గ్రహాన్ని 2017లో కనుగొన్నారు. ఇది భూమి కంటే పెద్దదిగా, నెప్ట్యూన్ కంటే చిన్నదిగా ఉండే 'సబ్-నెప్ట్యూన్' తరగతికి చెందిన గ్రహం. ఇది తన నక్షత్రం చుట్టూ జీవానికి అనుకూలమైన దూరంలో పరిభ్రమిస్తోంది. 2021లో డాక్టర్ మధుసూదన్, K2-18b వంటి గ్రహాలు 'హైసియన్' (Hycean) తరగతికి చెంది ఉండవచ్చనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. హైసియన్ గ్రహాలంటే విశాలమైన సముద్రాలు, హైడ్రోజన్ అధికంగా ఉండే వాతావరణం కలిగి, జీవానికి అనుకూల పరిస్థితులు ఉండేవి. 

1980లో భారతదేశంలో జన్మించిన డాక్టర్ నిక్కు మధుసూదన్, వారణాసిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుంచి మాస్టర్స్, పీహెచ్‌డీ పట్టాలు పొందారు. ప్రస్తుతం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇతర గ్రహాల వాతావరణం, వాటి నిర్మాణం, జీవానికి అనుకూలతపై ఆయన పరిశోధనలు కేంద్రీకృతమై ఉన్నాయి. 'హైసియన్' గ్రహాల భావనను పరిచయం చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి చెందారు.

డాక్టర్ మధుసూదన్ బృందం ఆవిష్కరణ, ఎన్రికో ఫెర్మీ పేరు మీదుగా వచ్చిన 'ఫెర్మీ పారడాక్స్' (Fermi Paradox) పై మళ్లీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంత విశాల విశ్వంలో జీవానికి అనుకూలమైన గ్రహాలు అనేకం ఉండే అవకాశం ఉంటే, మనకు ఇప్పటి వరకు గ్రహాంతర జీవుల జాడ ఎందుకు తగల్లేదు? అనేదే ఈ పారడాక్స్ సారాంశం. 

అయితే... K2-18b పై DMS గుర్తింపు ఈ పారడాక్స్‌ను పరిష్కరించనప్పటికీ, విశ్వంలో మనం ఒంటరి కాదనే సమాధానం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ K2-18b పై మరిన్ని పరిశీలనలు జరపనుంది. 
Nikku Madhusudhan
K2-18b
Exoplanet
Life on other planets
Dimethyl Sulfide
DMS
James Webb Space Telescope
JWST
Hycean planets
Astrobiology
Fermi Paradox
Sub-Neptune

More Telugu News