Vijay Sai Reddy: విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి

- జగన్ కోటరీ గురించి తీవ్ర విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి
- వైసీపీపై అభియోగాలు మోపేందుకు విజయసాయి చూస్తున్నారన్న సుబ్బారెడ్డి
- వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పింది విజయసాయేనని వ్యాఖ్య
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న హాజరైన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ జగన్ కోటరీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోటరీ వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ నుంచి వెళ్లిపోయిన తర్వాత పార్టీపై ఏదోరకంగా అభియోగాలు మోపాలని విజయసాయి చూస్తున్నారని సుబ్బారెడ్డి అన్నారు. ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు చక్రం తిప్పింది విజయసాయేనని... పార్టీలో కోటరీ ఉందో, లేదో ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. కోటరీ నడిపింది ఎవరో ఆయనకు తెలియదా? అని అడిగారు.
వైసీపీలో నెంబర్ 2 నుంచి 2 వేల స్థానానికి పడిపోయానని విజయసాయి అన్నారని... పార్టీలో నెంబర్ 2 అనేదే లేదని నెంబర్ వన్ నుంచి 100 వరకు అన్నీ జగనేనని సుబ్బారెడ్డి చెప్పారు.
వైసీపీ హయాంలో ఎలాంటి స్కాములు జరగలేదని... తమ పార్టీ నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని విమర్శించారు. లిక్కర్ స్కామ్ అంటూ కొందరిని భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అన్నింటిపైనా న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.