జగన్ తో మనస్పర్థలు రావడానికి తొలి కారణం ఇదే: రఘురామకృష్ణరాజు

  • కోడెల పట్ల వైసీపీ నేతలు చులకనగా మాట్లాడేవారన్న రఘురామ
  • తాను విభేదించడంతో జగన్ తో మనస్పర్థలు వచ్చాయని వెల్లడి
  • రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా ఊహించలేదన్న రఘురామ
వైసీపీ తరపున ఎంపీగా గెలుపొంది ఆ పార్టీ అధినేత జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుది. జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఏపీలో ఎవరూ సాహసించని సమయంలో ఆయనను రఘురామ ఢీకొన్నారు. వైసీపీలోనే ఉంటూ జగన్ పై, ఆ పార్టీలోని కీలక నేతలపై యుద్ధమే చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో రఘురామ మాట్లాడుతూ... జగన్ తో తనకు విభేదాలు ఎందుకొచ్చాయో వెల్లడించారు. 

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పట్ల వైసీపీ నేతలు చులకనగా మాట్లాడేవారని... అలా మాట్లాడటాన్ని తాను విభేదించడం వల్ల జగన్ తో తనకు తొలుత మనస్పర్థలు వచ్చాయని రఘురామ తెలిపారు. ఆ తర్వాత విభేదాలు ముదిరాయని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా ఊహించలేదని... తాను రాజకీయాల్లోకి రాకముందే ఎంతో మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించానని తెలిపారు. 

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లిలో జరిగిన ఎన్టీఆర్, కోడెల శివప్రసాద్ ల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రఘురామ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరామ్ తదితరులు పాల్గొన్నారు.


More Telugu News