Sunrisers Hyderabad: సన్ రైజర్స్... మళ్లీ అదే పరిస్థితి!

- 4 వికెట్ల తేడాతో నెగ్గిన ముంబయి ఇండియన్స్
- 163 పరుగుల టార్గెట్ ను 18.1 ఓవర్లలో కొట్టేసిన వైనం
- తలో చేయి వేసిన ముంబయి బ్యాటర్లు
- తేలిపోయిన సన్ రైజర్స్ బౌలింగ్
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇవాళ ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమిపాలైంది. వాంఖెడే స్టేడియంలో ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో నెగ్గారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేశారు.
అనంతరం, 163 పరుగుల లక్ష్యఛేదనలో ముంబయి 18.1 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసి విజయభేరి మోగించింది. ర్యాన్ రికెల్టన్ 21, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, తిలక్ వర్మ 21 (నాటౌట్), కెప్టెన్ హార్దిక్ పాండ్యా 21 పరుగులు చేశారు.
ఆఖర్లో ముంబయి ఇండియన్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. అప్పటికి విజయానికి కావాల్సింది ఒక్క పరుగే. సన్ రైజర్స్ పేసర్ ఎషాన్ మలింగ ఆ ఓవర్లో హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ (0) లను అవుట్ చేశాడు. అయితే, ఆ తర్వాతి ఓవర్లో తిలక్ వర్మ ఫోర్ కొట్టడంతో ముంబయి విజయం సాధించింది. సన్ రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్3, ఎషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు.