Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమరావతికి వస్తున్న మోదీ... ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తర్వాతే రావాలన్న షర్మిల

Modis Amaravati Visit Sharmila Demands Answers
Advertisement
  • అమరావతికి మోదీ చేసిన సాయం చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి మాత్రమేనన్న షర్మిల
  • ఇప్పుడు మళ్లీ సున్నం కొట్టడానికి వస్తున్నారని విమర్శ
  • హామీలన్నీ బుట్ట దాఖలు చేసి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్న
Advertisement
ప్రధాని మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. 

అమరావతికి మోదీ చేసిన సాయం చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి మాత్రమేనని ఆమె అన్నారు. ఆనాడు గాలి మోటార్లో తిరిగి ఆంధ్రుల నెత్తి మీద మట్టి కొట్టారని... ఇప్పుడు మళ్ళీ సున్నం కొట్టడానికి వస్తున్నారని విమర్శించారు. చివరకు ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అమరావతిని 'మోదీ శంకుస్థాపనల ప్రాజెక్ట్' కింద మార్చేశారని మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజధాని నిర్మాణంపై బీజేపీ చేస్తున్నది ఘరానా మోసమని షర్మిల అన్నారు. ఏపీకి బీజేపీ డ్రోహం చేస్తోందని విమర్శించారు. పోలవరం ఎత్తు తగ్గించి తీరని అన్యాయం చేసి.. రూ. 15 వేల కోట్లు అప్పు ఇచ్చి రాజధానిని ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. నిజంగా అమరావతిపై మోదీకి చిత్తశుద్ధి ఉంటే 9 ఏళ్లు గాడిదలు కాశారా? అని ప్రశ్నించారు. 

రాజధాని పనులపై ఒక్కనాడైనా బాధ్యతగా అడిగారా? ఒక్క రూపాయి నిధులైనా అమరావతికి కేటాయించారా? త్రీడీ గ్రాఫిక్స్ అమలు సంగతేంటని చంద్రబాబును ప్రశ్నించారా? గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతుంటే వేడుక చూసింది మీరు కాదా? ఇది తప్పని మీ దత్తపుత్రుడిని ఎందుకు వారించలేదు? అమరావతి రైతుల ఉద్యమం ఢిల్లీ దాకా పాకితే కనీసం స్పందించలేదు.. ఎందుకు? ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తామని ఇచ్చిన హామీ మరిచిపోయారా? అని ప్రశ్నించారు.

ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేసి ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని రాజధాని శంకుస్థాపనకు వస్తున్నారో మోదీ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. 10 ఏళ్లు దాటినా రాష్ట్రానికి రాజధాని లేదంటే... ఇందుకు ప్రధాన ముద్దాయి A1 మోదీ, A2 చంద్రబాబు, A3 జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. 

"ఏపీ నూతన రాజధాని నిర్మాణం విభజన హామీలలో ఒకటి. కేంద్రమే పూర్తి నిధులతో నిర్మించాల్సిన ప్రాజెక్ట్. ఆంధ్రుల రాజధాని అమరావతికి పూర్తి స్థాయి నిధులు ప్రకటన చేయాలి. 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. వైజాగ్ స్టీల్ ప్లాంటును సెయిల్ లో విలీనం చేయడంతో పాటు, కడప స్టీల్, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు లాంటి పెండింగ్ విభజన హామీలపై మీ వైఖరి తేల్చాలి. పోలవరం ఎత్తు 45 మీటర్లా? లేక 41 మీటర్లకే పరిమితమా? వీటిపై అమరావతి పనుల పునఃప్రారంభానికి వస్తున్న మోదీ క్లారిటీ ఇవ్వాలి" అని షర్మిల డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement
YS Sharmila
Modi
Amaravati
Andhra Pradesh
Capital City
Narendra Modi
Chandrababu Naidu
Jagan Mohan Reddy
Special Category Status
Polavaram Project

More Telugu News