Kona Venkat: ఇక్కడ హృదయాలు కాదు .. అంకెలు మాట్లాడతాయ్: కోన వెంకట్

- నిర్మాతగా బిజీగా ఉన్న కోన వెంకట్
- ఇక్కడ సక్సెస్ మాట్లాడుతుందని వ్యాఖ్య
- హిట్లు లేకపోతే హీరోలు కాల్స్ ఎత్తరని వెల్లడి
- చిన్నసినిమాలతో పెద్ద హిట్లు కొట్టాలని స్పష్టీకరణ
కోన వెంకట్ గురించి తెలియని వాళ్లుండరు. కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలపై ఆయనకి మంచి పట్టు ఉంది. నిర్మాతగా కూడా తన ప్రత్యేకతను చాటుతూ వెళుతున్నారు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ తో ఆయన మాట్లాడారు. "ఇండస్ట్రీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే హార్ట్ లెస్. ఇండస్ట్రీకి కావలసింది సక్సెస్ .. సక్సెస్ ఉంటేనే మనకి రెస్పెక్ట్ ఉంటుంది. సక్సెస్ లేని రోజున మన కాల్స్ కూడా ఎవరూ ఎత్తరు" అని అన్నారు.
ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టలేం. ఒక సినిమా బడ్జెట్ కొన్ని కోట్లలో ఉంటుంది. నేను ఇచ్చిన కథ వలన ఒక సినిమా పోయిందని అనుకుందాం. అలాంటప్పుడు ఆ హీరో గానీ .. నిర్మాతగాని నాతో మళ్లీ ఇంకో సినిమా ఎందుకు చేస్తారు? వాళ్లకు మళ్లీ హిట్ ఇవ్వాలనే పట్టుదల నాకు ఉంటుంది. కానీ మళ్లీ వాళ్లు మనలను నమ్మాలని ఎక్కడుంది? ఇక్కడ అంతా కమర్షియల్ .. హృదయాలు కాదు .. అంకెలు మాట్లాడతాయి" అని అన్నారు.
"హిట్లు ఉన్న దర్శకుల కోసం హీరోలు గేట్లు .. తలుపులు తెరిచిపెడతారు. ఆ డైరెక్టర్లకు రెండు ఫ్లాపులు పడితే చాలు .. వాళ్ల కాల్స్ కూడా తీయరు. ఇక్కడ అందరికీ సక్సెస్ కావాలి .. అన్నిసార్లు సక్సెస్ కావాలి .. కానీ దానికంటూ ఒక మంత్రం లేదు. సక్సెస్ లేకపోతే పెద్ద హీరోలతో సినిమాలు చేయడం కష్టం. అలాంటప్పుడు చిన్నహీరోలతో పెద్ద హిట్లు కొట్టడానికి ట్రై చేయాలి. అలా నేను చేసిన సినిమానే 'గీతాంజలి' అని అన్నారు.