Gudivada Amarnath: బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానం పెట్టారు: గుడివాడ అమర్ నాథ్

- జీవీఎంసీ మేయర్ పై కూటమి అవిశ్వాస తీర్మానం
- మహిళను మేయర్ పీఠం నుంచి దింపేందుకు కుట్రలు చేస్తున్నారన్న గుడివాడ
- వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తున్నామని వెల్లడి
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో తగినంత బలం లేకపోయినప్పటికీ వైసీపీ మేయర్ పై కూటమి నేతలు అవిశ్వాస తీర్మానం పెట్టారని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ మండిపడ్డారు. బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దింపేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ కార్పొరేటర్లపై గత నెల రోజుల నుంచి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు.
వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తున్నామని... ఈ నెల 19న జరిగే అవిశ్వాస తీర్మానంలో వైసీపీ కార్పొరేటర్లు పాల్గొనకూడదని అమర్ నాథ్ తెలిపారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు అవసరమైనంత బలం తమకు ఉందని చెప్పారు. వైస్రాయ్ హోటల్ తరహా రాజకీయాలకు సీఎం చంద్రబాబు ఇప్పటికైనా ముగింపు పలకాలని సూచించారు.
విశాఖ మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ... మహిళల మీద ఉన్న గౌరవంతో మేయర్ గా జగన్ తనకు అవకాశం కల్పించారని చెప్పారు. యాదవులకు జగన్ పెద్ద పీట వేశారని... యాదవుల కోరిక మేరకు భవన నిర్మాణం కోసం 50 సెంట్ల స్థలాన్ని కేటాయించారని తెలిపారు. యాదవ వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించేయాలని చూడటం సమంజసం కాదని చెప్పారు.