Mamata Banerjee: బెంగాల్ హింస వెనుక అమిత్ షా హస్తం: మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

- ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిన హింస అన్న మమతా బెనర్జీ
- అమిత్ షా, బీఎస్ఎఫ్ కలిసి బంగ్లాదేశీయులను బెంగాల్‌లోకి వదిలారని ఆరోపణ
- అమిత్ షాను ప్రధాని నరేంద్ర మోదీ నియంత్రించాలని సూచన
వక్ఫ్ చట్టం-2025కి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కారణమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిన హింస అని వ్యాఖ్యానించారు.
అమిత్ షా, బీఎస్ఎఫ్ కలిసి కుట్రపూరితంగా బంగ్లాదేశీయులను బెంగాల్‌లోకి వదిలారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై దర్యాప్తు సంస్థలను అస్త్రంగా ఉపయోగించి భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను నియంత్రించాలని డిమాండ్ చేశారు.
ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలకు సంబంధించిన దృశ్యాలను బెంగాల్‌లో జరుగుతున్నట్లుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తమ పార్టీ ముందుందని, కాబట్టి ప్రజలు శాంతియుతంగా నిరసన తెలపాలని ఆమె సూచించారు.