Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుమారుడిని కాపాడిన భారత కార్మికులకు సింగపూర్ ప్రభుత్వం అవార్డు

- ఈ నెల 8న సింగపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం
- మంటల్లో చిక్కుకున్న చిన్నారులను కాపాడిన కార్మికులు
- వారిని ‘లైఫ్ సేవర్’ అవార్డుతో సత్కరించిన ప్రభుత్వం
సింగపూర్ స్కూల్‌లో ఈ నెల 8న జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సహా చిన్నారులను కాపాడిన భారత కార్మికులకు సింగపూర్ ప్రభుత్వం ‘లైఫ్ సేవర్’ అవార్డును ప్రదానం చేసింది. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను రక్షించినందుకు గాను ఈ అవార్డును ప్రదానం చేసినట్టు సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.
ఈ ప్రమాదంపై కార్మికులు మాట్లాడుతూ.. తాము చూసేసరికి గదిలో పిల్లలు భయంతో అరుస్తూ కనిపించారని తెలిపారు. కొందరు పిల్లలు మూడో అంతస్తు నుంచి దూకేయాలని కూడా చూశారన్నారు. వారితో మాట్లాడి దూకకుండా చూశామని, ఆ తర్వాత వారిని రక్షించి కిందికి తీసుకొచ్చామని వివరించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన చిన్నారిని కాపాడలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నామని వివరించారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే సింగపూర్ వెళ్లిన పవన్ కల్యాణ్ దంపతులు.. అక్కడ చికిత్స అనంతరం కోలుకున్న కుమారుడు మార్క్ శంకర్‌ను ఇండియాకు తీసుకొచ్చారు. కాగా, ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులు సహా 20 మంది గాయపడ్డారు.