Nara Lokesh: ఉన్నత విద్య సలహామండలిలో పారిశ్రామికవేత్తలకు చోటు: మంత్రి నారా లోకేశ్

- ఏపీ ప్రభుత్వం–సీఐఐ ఏపీ శాఖ ఉమ్మడి కన్సల్టేటివ్ కమిటీ తొలి సమావేశం
- ముఖ్యఅతిధిగా పాల్గొన్న నారా లోకేశ్
- 5 ఏళ్లలో 3 లక్షలమంది స్కిల్డ్ వర్కర్లను సిద్ధం చేస్తామని వెల్లడి
మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఉన్నత విద్యలో డిజిటల్ స్కిల్స్ పెంపొందించేందుకు వీలుగా ఉన్నతవిద్య సలహా మండలిలో పారిశ్రామికవేత్తలకు చోటు కల్పిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ ప్రభుత్వం–సీఐఐ ఏపీ శాఖ ఉమ్మడి కన్సల్టేటివ్ కమిటీ తొలి సమావేశంలో మంత్రి లోకేశ్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... ప్రస్తుతం ఏపీలో ఉన్నత విద్యలో కేవలం 20 శాతం మాత్రమే డిజిటల్ కంటెంట్ ఉందని, ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో 70 శాతంగా ఉందన్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు ఉన్నత విద్య కరిక్యులమ్ లో పెద్దఎత్తున మార్పులు చేయాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఒకేషనల్ కోర్సులకు ప్రాధాన్యతనిస్తున్నామని, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా జర్మన్ మోడల్ ఒకేషనల్ కోర్సుల్లో కరిక్యులమ్ రూపొందిస్తామని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో 3 లక్షలమంది స్కిల్డ్ వర్కర్లను సిద్ధం చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రధాన పోర్టుల్లో సరుకు ఎగుమతులకు కంటెనర్ల సమస్య ఉందని సీఐఐ ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. పారిశ్రామిక సముదాయాలకు సమీపంలో గోదాముల సమస్య అధికంగా ఉందన్నారు. విశాఖ వంటి నగరాలకు సమీపంలో గోడౌన్ల అద్దె భారీగా ఉన్నందున వేర్ హౌసింగ్ సౌకర్యం కల్పించాలని చెప్పారు.
దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ పరిశ్రమదారులు సొంతగా గోడౌన్లు నిర్మించుకుంటే రాయితీలు ఇస్తామని అన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినపుడు యాజమాన్యాలపై తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని, ఎక్స్ గ్రేషియా విషయంలో ఫ్యాక్టరీస్ శాఖ నిబంధనలను అమలుచేయాలని అన్నారు. అనకాపల్లి–ఆనందపురం రోడ్డును 80 మీటర్ల రహదారిగా విస్తరించాలని కోరారు. ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించాలని, డేటా సెంటర్లకు గ్రీన్ పవర్ సరఫరాకు చర్యలు తీసుకొని, స్టాండర్డ్ పవర్ టారిఫ్ లు నిర్ణయించాలని సీఐఐ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.