Kotta Prabhakar Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలని కోరుకుంటున్నాను: కొత్త ప్రభాకర్ రెడ్డి

- కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగాలని కేసీఆర్ కూడా కోరుకుంటున్నారన్న ఎమ్మెల్యే
- ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు ఎప్పుడూ చేయలేదని స్పష్టీకరణ
- ఇక ముందు కూడా చేయబోమన్న కొత్త ప్రభాకర్ రెడ్డి
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు పూర్తికాలం కొనసాగాలని తాను కోరుకుంటున్నానని బీఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగాలని తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు కూడా ఆకాంక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని తాము ఎప్పుడూ ప్రయత్నించలేదని ఆయన స్పష్టం చేశారు. ఇక ముందు కూడా ఆ ప్రయత్నాలు చేయబోమని తేల్చి చెప్పారు. గజ్వేల్‌లో మాత్రమే కాకుండా, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ భూదందాలు జరిగినా ప్రభుత్వం వెలికి తీయాలని డిమాండ్ చేశారు.
ఇటీవల కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని కొంతమంది తమతో చెప్పారని కొత్త ప్రభాకర్ రెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన మరోసారి స్పందించారు.