Jeff Bezos: స్పేస్ నుంచి తిరిగొచ్చిన కాబోయే భార్య... హత్తుకుని స్వాగతం పలికిన అమెజాన్ అధినేత... వీడియో ఇదిగో!

- గాయని కేటీ పెర్రీ సహా ఆరుగురు మహిళలతో కూడిన బృందం అంతరిక్ష యాత్ర
- పూర్తిగా మహిళలతో స్సేస్ వోయేజ్
- ఓ ట్రిప్ వేసొచ్చిన బెజోస్ కాబోయే భార్య లారెన్ శాంచెజ్
ప్రముఖ పాప్ గాయని కేటీ పెర్రీ సహా ఆరుగురు మహిళలతో కూడిన బృందం అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుంది. బ్లూ ఆరిజిన్ సంస్థకు చెందిన రాకెట్‌లో సోమవారం నింగిలోకి దూసుకెళ్లిన ఈ బృందం, కొద్దిసేపటి తర్వాత సురక్షితంగా భూమికి చేరుకుంది. గత 60 ఏళ్లలో కేవలం మహిళలతోనే సాగిన తొలి అంతరిక్ష యాత్ర ఇదే కావడం విశేషం.
బిలియనీర్ జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రత్యక్ష ప్రసారం చేసిన వివరాల ప్రకారం, ఈ బృందం పశ్చిమ టెక్సాస్ నుంచి సోమవారం ఉదయం 9:31 గంటలకు నింగిలోకి బయలుదేరింది. అంతరిక్షపు అంచు వరకు ప్రయాణించిన వీరు, అక్కడ కొద్దిసేపు భారరహిత స్థితిని అనుభవించారు. మొత్తం మీద ఈ యాత్ర దాదాపు 11 నిమిషాల పాటు సాగింది. అంతరిక్ష పర్యాటకం కోసం జెఫ్ బెజోస్ అభివృద్ధి చేసిన న్యూ షెపర్డ్ వాహక నౌకకు ఇది మరో ముఖ్యమైన విజయం.
కేటీ పెర్రీతో పాటు ఈ యాత్రలో జెఫ్ బెజోస్ కాబోయే భార్య లారెన్ సాంచెజ్, సీబీఎస్ వ్యాఖ్యాత గేల్ కింగ్, నాసా మాజీ రాకెట్ శాస్త్రవేత్త అయేషా బోవే, శాస్త్రవేత్త అమందా ఎన్గుయెన్, సినీ నిర్మాత కెరియాన్నె ఫ్లిన్ ఉన్నారు.
యాత్ర ముగించుకుని క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చిన లారెన్ సాంచెజ్‌ను జెఫ్ బెజోస్ ఆలింగనం చేసుకున్న దృశ్యాలు కనిపించాయి. భారరహిత స్థితిని అనుభవించిన తర్వాత తిరిగి తమ సీట్లలోకి వచ్చాక, కేటీ పెర్రీ లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ పాడిన 'వాట్ ఎ వండర్‌ఫుల్ వరల్డ్' గీతాన్ని ఆలపించారని గేల్ కింగ్ తెలిపారు.
భూమికి తిరిగి వచ్చిన అనంతరం కేటీ పెర్రీ మాట్లాడుతూ, "ప్రేమతో చాలా అనుసంధానమైనట్లు భావిస్తున్నాను" అని అన్నారు. తన కుమార్తె డైసీకి గుర్తుగా, ఆమె ఒక డైసీ పువ్వును అంతరిక్షంలోకి తీసుకెళ్లి, తిరిగి పట్టుకొచ్చారు.
ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు లాంచ్ ప్యాడ్ వద్దకు గేల్ కింగ్ సన్నిహితురాలు, ప్రముఖ వ్యాఖ్యాత ఓప్రా విన్‌ఫ్రే కన్నీటి పర్యంతమవుతూ హాజరయ్యారు. వారితో పాటు క్రిస్ జెన్నర్, ఖ్లో కర్దాషియాన్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.
అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ, సోవియట్ వ్యోమగామి వాలెంటినా తెరిష్కోవా 1963లో దాదాపు మూడు రోజుల పాటు ఒంటరిగా భూమి చుట్టూ పరిభ్రమించిన తర్వాత, కేవలం మహిళలతో కూడిన అంతరిక్ష యాత్ర ఇదే మొదటిది.