MS Dhoni: మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన ధోనీ.. హోటల్‌కు వెళ్లేటప్పుడు కుంటుతూ నడిచిన తలా.. ఆందోళనలో అభిమానులు!

- నిన్న లక్నోతో మ్యాచ్‌లో అదరగొట్టిన ధోనీ
- కేవలం 11 బంతుల్లోనే 26 పరుగులు బాదిన మహీ
- మ్యాచ్ అనంతరం హోటల్‌కు తిరిగెళ్లే క్రమంలో నడిచేందుకు ఇబ్బందిపడ్డ వైనం
- ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఆందోళనలో ఫ్యాన్స్
సోమవారం నాడు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో జరిగిన ఐపీఎల్ 30వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఎంఎస్‌డీ కేవలం 11 బంతుల్లోనే 26 పరుగులు బాది, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దాంతో సీఎస్‌కే వరుస పరాజయాలకు బ్రేక్ పడడంతో పాటు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది.
ఇక మ్యాచ్ అనంతరం సీఎస్‌కే జట్టు లక్నోలో తాము బస చేసిన హోటల్‌కు తిరిగి వెళ్లింది. అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది. అయితే, ధోనీ మాత్రం హోటల్ లాబీ ప్రాంతంలో కుంటుతూ కనిపించాడు. మహీ నడిచేందుకు ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో ఈ విషయమై అభిమానులు ఆరా తీస్తున్నారు.
రెండేళ్ల కిందట ధోనీ ఎడమ మోకాలికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆ గాయం మళ్లీ తిరగబెట్టినట్లు ఉందని, ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.