Yasmin Banu: చిత్తూరు జిల్లాలో పరువు హత్య.. మతాంతర వివాహం చేసుకున్న యువతి అనుమానాస్పద మృతి

Chittor Honor Killing Woman Dies Mysteriously After Interfaith Marriage

  • యువతి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించకపోవడంతో నెల్లూరులో వివాహం
  • ఆమె తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించిన జంట
  • ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు
  • తండ్రికి ఆరోగ్యం బాగాలేదని పిలిచి కుమార్తె హత్య!

మతాంతర వివాహం చేసుకున్న ఓ యవతి కన్నవారింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఇది పరువు హత్యేనని, తన భార్యను ఆమె కన్నవారే చంపేశారని మృతురాలి భర్త ఆరోపిస్తున్నాడు. చిత్తూరులో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా గత రాత్రి వెలుగులోకి వచ్చింది. 

పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక బాలాజీ నగర్‌కు చెందిన యాస్మిన్‌బాను (26) ఎంబీఏ పూర్తి చేసింది. బీటెక్ చదివిన సాయితేజ్‌తో కాలేజీ రోజుల్లోనే ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలో వారిద్దరూ వివాహానికి సిద్ధమయ్యారు. అయితే, సాయితేజ ఎస్సీ వర్గానికి చెందిన వాడు కావడంతో యాస్మిన్ తల్లిదండ్రులు షౌకత్ అలీ, ముంతాజ్ అంగీకరించలేదు. దీంతో వీరిద్దరూ ఈ ఏడాది ఫిబ్రవరి 9న నెల్లూరులో వివాహం చేసుకున్నారు. తమ తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని అదే నెల 13న తిరుపతి డీఎస్పీని కలిసి విన్నవించారు. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

అయితే, కొన్ని రోజులుగా యాస్మిన్ కుటుంబ సభ్యులు ఫోన్‌లో కుమార్తెతో మాట్లాడటం మొదలుపెట్టారు. తండ్రి షౌకత్ అలీకి ఆరోగ్యం బాగాలేదని, ఒకసారి వచ్చి చూసి వెళ్లాలని యాస్మిన్‌ను పదేపదే కోరారు. దీంతో ఆదివారం ఉదయం సాయితేజ తన భార్యతో కలిసి చిత్తూరులోని గాంధీ విగ్రహం కూడలి వద్దకు వెళ్లి ఆమె సోదరుడి కారులో ఎక్కించి తల్లిగారింటికి పంపాడు. ఆ తర్వాత కాసేపటికే సాయితేజ తన భార్యకు ఫోన్ చేస్తే కలవలేదు. దీంతో అనుమానం వచ్చి నేరుగా వారింటికి వెళ్లాడు. యాస్మిన్ ఇంట్లో లేదని, ఆత్మహత్య చేసుకోవడంతో ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉందని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

దీంతో పరుగుపరుగున ఆసుపత్రికి వెళ్లిన సాయితేజ అక్కడి మార్చురీలో భార్య మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. తన భార్యను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని సాయితేజ ఆరోపించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న యాస్మిన్ తండ్రి షౌకత్ అలీ, ఆమె పెద్దమ్మ కొడుకు లాలూ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Yasmin Banu
Chittor Honor Killing
Interfaith Marriage
Sai Teja
Shokat Ali
Murder Investigation
Andhra Pradesh Crime
Chittoor District
Suspicious Death
  • Loading...

More Telugu News