MS Dhoni: చెన్నై గెలిచిందోచ్.. ఐదు మ్యాచ్‌ల తర్వాత తొలి గెలుపు

Chennai Super Kings Win After 5 Losses

  • లక్నోపై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన చెన్నై
  • కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన ధోనీ
  • ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్

ఐపీఎల్‌లో చెన్నై జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. ఐదు వరుస ఓటముల తర్వాత గెలుపు బాట పట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సమష్టిగా రాణించి ఎట్టకేలకు మరో గెలుపును తన ఖాతాలో వేసుకొంది. ఎల్ఎస్‌జీ నిర్దేశించిన 168 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై 96 పరుగులకే షేక్ రషీద్ (27), రచిన్ రవీంద్ర (37), రాహుల్ త్రిపాఠి (9), రవీంద్ర జడేజా (7) వికెట్లను కోల్పోయింది.

స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోతుండటంతో ఓటముల్లో చెన్నైకి డబుల్ హ్యాట్రిక్ తప్పదని అందరూ భావించారు. అయితే, క్రీజులో కుదురుకున్న శివం దూబే నిలకడగా ఆడుతూ పరుగులు సాధించడంతో చెన్నై విజయం దిశగా సాగింది. ఈ క్రమంలో 111 పరుగులు వద్ద విజయ్ శంకర్ (9) అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ.. దూబేతో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. దూబే 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేయగా, ధోనీ 11 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 26 పరుగులు చేశాడు. మొత్తంగా 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్‌కు రెండు వికెట్లు దక్కాయి. కీలక ఇన్నింగ్స్ ఆడిన ధోనీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. వరుసగా విఫలమవుతూ విమర్శలు మూటగట్టుకున్న కెప్టెన్ రిషభ్ పంత్ ఈ మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 30, ఆయుష్ బదోని 22, అబ్దుల్ సమద్ 20 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా, మతీశ పథిరన చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన లక్నోకు ఇది మూడో పరాజయం కాగా, చెన్నైకి ఇది రెండో గెలుపు. పాయింట్ల పట్టికలో లక్నో నాలుగో స్థానంలో ఉండగా, చెన్నై అట్టడుగున ఉంది. ఐపీఎల్‌లో నేడు పంజాబ్ కింగ్స్, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

MS Dhoni
Chennai Super Kings
IPL 2023
Lucknow Super Giants
CSK vs LSG
IPL Match
Dhoni Player of the Match
Shivam Dube
Ravindra Jadeja
Rishabh Pant
  • Loading...

More Telugu News