Banwarilal: ఈ ఎస్ఐ నిజంగా పరమానందయ్య శిష్యుడే!

- దొంగకు నోటీసు ఇవ్వడానికి వెళ్లి జడ్జి కోసం వెతుకులాడిన ఎస్ఐ
- ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఘటన
- దొంగ పేరు ఉండాల్సిన చోట తమ పేరు ఉండటంతో ఎస్ఐకి చివాట్లు పెట్టిన న్యాయమూర్తి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌లో ఒక సబ్ ఇన్స్‌పెక్టర్ పరమానందయ్య శిష్యుడిలా వ్యవహరించి న్యాయమూర్తితో చివాట్లు తిన్నారు. ఒక దొంగతనం కేసులో నిందితుడికి జారీ చేసిన నోటీసును తీసుకువెళ్ళిన ఎస్ఐ, సదరు నిందితుడి కోసం వాకబు చేయాల్సింది పోయి, దొంగకు బదులుగా జడ్జి కోసం వెతకడం గమనార్హం. చివరికి దొంగకు నోటీసులు ఇవ్వడంలో విఫలమయ్యారు. ఆ నోటీసులను తిరిగి కోర్టుకు సమర్పిస్తూ ఎస్ఐ చెప్పిన సమాధానానికి న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు.
విషయంలోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన సబ్ ఇన్స్‌పెక్టర్ బన్వారిలాల్ ఒక దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి కోర్టు నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళారు. అయితే, నోటీసు మీద ఉన్న అడ్రస్‌లో దొంగ పేరు రాసుకోవాల్సిన చోట ఆ ఎస్ఐ పొరపాటున న్యాయమూర్తి నగ్మా ఖాన్ పేరు రాసుకున్నారు. దొంగతనం చేసిన వ్యక్తి ప్రాంతానికి వెళ్లి నాగ్మా ఖాన్ ఇల్లు ఎక్కడ అంటూ అక్కడి వారిని ప్రశ్నించారు. ఆ పరిసర ప్రాంతాల్లోని వారు ఇక్కడ నగ్మాఖాన్ పేరుతో ఎవరూ లేరని చెప్పడంతో సదరు ఎస్ఐ తదుపరి వాయిదా సందర్భంలో కోర్టుకు వచ్చి తనకు అప్పగించిన నోటీసులను తిరిగి ఇచ్చేశారు.
నోటీసులో పేర్కొన్న దొంగ పేరుతో అక్కడ ఎవరూ లేరని, నోటీసులను సవరించి ఇవ్వాలని ఎస్ఐ కోర్టును కోరారు. ఎస్ఐ తిరిగి కోర్టుకు సమర్పించిన నోటీసును పరిశీలించిన న్యాయమూర్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దొంగ పేరు రాయాల్సిన చోట తన పేరు రాయడం ఏమిటని ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఎవరికి నోటీసు పంపిందో కూడా పోలీస్ అధికారికి తెలియకపోవడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు. కోర్టు నోటీసు ఎవరికి ఇచ్చారనేది కనీసం పరిశీలించకపోవడంపై న్యాయమూర్తి మండిపడ్డారు.
సదరు పోలీసు అధికారి కనీసం ఆ నోటీసును చదివినట్లు కూడా లేదని, దీన్ని బట్టి కనీస పరిజ్ఞానం కూడా ఎస్ఐకి లేదనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు నోటీసులు అందించే ఉద్యోగులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహించాలని పోలీస్ శాఖను ఆదేశిస్తూ, సదరు ఎస్ఐ బన్వారిలాల్‌పై చర్యలు తీసుకోవాలని యూపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. సదరు ఎస్ఐ నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇతను నిజంగా పరమానందయ్య శిష్యుడేనంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.