Ronanki Kurmanath: ఏపీకి తాజా వర్ష సూచన

- రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం
- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు పిడుగుల పడే అవకాశం
- మంగళవారం పలు జిల్లాల్లో ప్రభావం
- ప్రజలు, రైతులు జాగ్రత్తలు పాటించాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచన
ఏపీలో రాగల మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయని, పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఏపీఎస్డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల అప్రమత్తత వహించాలని ఆయన సూచించారు.
ముఖ్యంగా మంగళవారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారం ఉందని కూర్మనాథ్ వివరించారు. ఈ మేరకు సంబంధిత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఉరుములతో కూడిన వర్షం పడుతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడవద్దని ఆయన స్పష్టం చేశారు. సురక్షితమైన భవనాల్లో లేదా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. అలాగే, వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులు కూడా వాతావరణ మార్పులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ పేర్కొన్నారు. రానున్న మూడు రోజుల పాటు వాతావరణ శాఖ సూచనలను గమనిస్తూ ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.