Bangaaru Babu: సినీ ఫైనాన్షియర్ కొడుకు పెళ్లంటే ఈ మాత్రం ఉండాలి... హాజరైన హేమాహేమీలు!

- ప్రముఖ ఫైనాన్షియర్ బంగారు బాబు కొడుకు వివాహం
- అంగరంగవైభవంగా వివాహ వేడుక
- తరలివచ్చిన టాలీవుడ్
టాలీవుడ్ లో బంగారు బాబు గురించి తెలియని వాళ్లంటూ ఉండరు. ఆయన ప్రముఖ ఫైనాన్షియర్. ఆర్ సెక్యూర్డ్ ఫైనాన్స్ సంస్థకు అధినేత. అనేక సూపర్ హిట్ సినిమాలకు ఆర్థిక అండదండలు అందించారు. కాగా, హైదరాబాదులో బంగారుబాబు తనయుడి వివాహం జరిగింది. అంగరంగ వైభవంగా, అట్టహాసంగా, కళ్లు చెదిరే రీతిలో... అనే పదాలకు అర్థం ఇదే అనే రీతిలో ఈ పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది. పెళ్లి మండపంలో ఎటు చూసినా రిచ్ నెస్ కనిపించింది. దాదాపు టాలీవుడ్ హేమాహేమీలందరూ రావడంతో ఈ వివాహ వేడుక జిగేల్మనిపించింది.
దర్శకుడు సుకుమార్, విజయశాంతి, రాజేంద్రప్రసాద్, హరీశ్ శంకర్, మురళీమోహన్, అల్లు అరవింద్, దిల్ రాజు, నవీన్ యెర్నేని, శరత్ మరార్, చోటా కె నాయుడు, రఘుబాబు, అశ్వినీదత్, సాయికుమార్, ఎస్వీ కృష్ణారెడ్డి, సీనియర్ నిర్మాత, నటుడు అశోక్ కుమార్, బెల్లంకొండ శ్రీనివాస్ తదితర సినీ ప్రముఖులు ఈ వివాహ మహోత్సవానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వైసీపీ నేత తమ్మినేని సీతారాం, ఏబీఎన్ రాధాకృష్ణ. ఎన్టీవీ నరేంద్ర చౌదరి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.