Tanmayashri: కారు డోర్లు లాక్ పడి ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదం
- మృతి చెందిన అక్కాచెల్లెళ్లు తన్మయశ్రీ, అభినయశ్రీ
- కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కారు డోర్లు లాక్ అవడంతో అందులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు.
దామరగిద్దకు చెందిన తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4) అక్కాచెల్లెళ్ల పిల్లలు. వారు ఇంటి ముందు పార్క్ చేసిన కారులోకి వెళ్లగా, డోర్లు లాక్ పడ్డాయి. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. కారులోపల ఊపిరాడక ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
ఎంతసేపటికీ చిన్నారులు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారి కోసం వెతికారు. కారులో అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలను గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.