Swapna: స్వప్న కథ విని చలించిన సీఎం... క్లౌడ్ ఇంజనీర్‌గా మారుస్తానని హామీ!

నిరుపేద కుటుంబానికి చెందిన ఓ దళిత యువతి తన దీనస్థితిని వివరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట కన్నీటిపర్యంతమవ్వగా, ఆయన తక్షణమే స్పందించి ఆమెకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తానని భరోసా ఇచ్చారు. మెరుగైన శిక్షణ ఇప్పించి 'క్లౌడ్ ఇంజనీర్'ను చేస్తానని, సొంత ఇంటి కలను కూడా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.
తన కుటుంబ పరిస్థితులను వివరిస్తూ గొడవర్తి స్వప్న అనే యువతి ముఖ్యమంత్రి దృష్టికి తన సమస్యలను తీసుకెళ్లారు. తాను డిగ్రీ పూర్తి చేశానని, కంప్యూటర్ డేటా ఎంట్రీ కూడా వచ్చని తెలిపారు.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయానని, అన్నయ్య తనను చదివించారని చెప్పారు. ప్రస్తుతం భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి మామగారు కట్టించిన చిన్న ఇంట్లోనే మరో మూడు కుటుంబాలతో కలిసి నివాసం ఉంటున్నామని, ఇది చాలా ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
తన భర్త సెంటరింగ్ (సెంట్రింగ్) కూలీ అని, ఆయనకు నెలలో 15 రోజులు మాత్రమే పని దొరుకుతుందని, దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని, ప్రభుత్వ సాయంతో ఒక ఇల్లు మంజూరు చేయాలని ఆమె ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.
స్వప్న చెప్పిన వివరాలను సావధానంగా విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చలించిపోయారు. ఆమెను "మట్టిలో మాణిక్యం" అని అభివర్ణించారు. డిగ్రీ చదివి, కంప్యూటర్ నైపుణ్యాలు కలిగి ఉండి కూడా సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న స్వప్న లాంటి వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. "నీకు కేవలం డేటా ఎంట్రీయే కాదు, నీ నైపుణ్యాలను మరింత మెరుగుపరిచి నిన్ను ఒక క్లౌడ్ ఇంజనీర్‌గా తీర్చిదిద్దే బాధ్యత నాది" అని చంద్రబాబు స్వప్నకు హామీ ఇచ్చారు.
ఈ బాధ్యతను తన మిత్రుడు, 'ఫై డేటా సెంటర్స్' సంస్థకు చెందిన కల్యాణ్ ముప్పనేనికి అప్పగిస్తున్నట్లు సీఎం తెలిపారు. కల్యాణ్ ముప్పనేనికి డేటా సెంటర్ ఉందని, స్వప్నకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించడం పెద్ద కష్టం కాదని అన్నారు. ఈ శిక్షణ ద్వారా స్వప్న త్వరలోనే నెలకు రూ. 30,000 నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించే స్థాయికి ఎదుగుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
అంబేద్కర్ ఉన్నతికి బరోడా మహారాజు సహాయపడినట్లే, స్వప్న ఎదుగుదలకు కల్యాణ్ మార్గదర్శిగా నిలుస్తారని పేర్కొన్నారు. కల్యాణ్ ముప్పనేని ఇలాంటి వంద కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారని కూడా చంద్రబాబు వెల్లడించారు.
స్వప్న కుటుంబానికి అవసరమైన ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటున్నానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి దాతలు, మార్గదర్శకులు ముందుకు వస్తే రాష్ట్రంలో ఎన్నో కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని ఆయన అన్నారు. స్వప్న లాంటి వారిని ప్రోత్సహించడం ద్వారా వారి కుటుంబాలే కాకుండా, సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.