YS Sharmila: రాజధానికి మరో 44 వేల ఎకరాలు కావాలట... చంద్రబాబుపై షర్మిల విమర్శలు

YS Sharmila Criticises Chandrababu Naidu over Amaravati Land Acquisition
  • ఏపీ రాజధాని విస్తరణకు ప్రభుత్వం ఆలోచన
  • మరో 44 వేల ఎకరాలు కావాలంటున్నారని షర్మిల ధ్వజం
  • అంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్న
  • గతంలో సేకరించిన 34 వేల ఎకరాల్లో ఏం చేశారో చెప్పాలని నిలదీత
రాజధాని అమరావతి అంశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. గతంలో రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన సుమారు 34 వేల ఎకరాల భూమి వినియోగంపై స్పష్టత ఇవ్వకుండా, కొత్తగా వేల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా, ఇతర మార్గాల్లో సేకరించిన 34 వేల ఎకరాల్లో అసలు ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. 

"ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది ఏపీ సీఎం చంద్రబాబు తీరు. రాజధాని అమరావతి పేరుతో సేకరించిన 34 వేల ఎకరాల్లో అభివృద్ధికే దిక్కులేదు. పునరుజ్జీవనం పేరుతో ఇప్పుడు మరో 44 వేల ఎకరాలు అర్జెంటుగా అవసరం వచ్చిందట. అందులో అద్భుత ప్రపంచం కడతాడట. అరచేతిలో వైకుంఠం చూపించడం, AI పేరుతో గ్రాఫిక్స్ మాయ చేయడం, లేనిది ఉన్నట్లు నమ్మించడం ఒక్క బాబు గారికే తెలిసిన విద్య. 

రాజధాని విస్తరణ పేరుతో, విలువైన రైతుల భూములను మళ్ళీ తక్కువకే కాజేసి, తన అనుయాయులకు కట్టబెట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూసే కుట్ర తప్ప మరోటి కాదు. కూటమి ప్రభుత్వానికి భూ దోపిడీపై పెట్టే శ్రద్ధ... ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంపై పెట్టడం లేదు. సేకరించిన భూముల్లో ముందు రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి అసలే లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం. 

రాజధాని విస్తరణకు భూములు సేకరించడం తప్పు కాదు. అఖండ అమరావతికి మోకాలడ్డడం మా ఉద్దేశం అంతకన్నా కాదు. కానీ సేకరించిన 34 వేల ఎకరాల్లో అసలు రాజధాని ఎక్కడ? కూలిపోయే స్థాయిలో ఉన్న తాత్కాలిక కట్టడాలు, ఎటు చూసినా పాడుబడిన భూములు... ఇదేనా ఆంధ్రుల ఆత్మగౌరవం? సింగపూర్ ను తలదన్నే ఆకాశ హర్మ్యాలు ఎక్కడ? 

రాజధానిని ముందు నిలబెట్టకుండా... ఒక రూపం అంటూ తీసుకురాకుండా... చిత్రాలతో విచిత్రాలు చేస్తూ... ఇప్పుడే 44 వేల ఎకరాలు అదనంగా గుంజుకోవడం అంటే మరో నాలుగు మండలాల రైతులను మోసం చేస్తున్నట్లు కాదా? ఫేజ్-1 లో సేకరించిన 34 వేల ఎకరాల్లో 2 వేల ఎకరాలు మిగలడం ఏంటి? సీడ్ క్యాపిటల్ కి పోను మిగిలిన 20 వేలకు పైగా ఎకరాలు, 15 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఎవరికిచ్చారు? ఏ సంస్థలకు  కేటాయించారు? ఏ ప్రాతిపదికన భూములు ఇచ్చారు?... ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. 34 వేల ఎకరాలపై వెంటనే పూర్తి స్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలి" అని షర్మిల డిమాండ్ చేశారు.  
YS Sharmila
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh Capital
Land Acquisition
Real Estate
Land Pooling
AP Politics
Farmers
Capital Region

More Telugu News