Mehul Choksi: పరారీలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు మెహుల్ చోక్సీ అరెస్ట్

Mehul Choksi Arrested in Belgium PNB Scam Fugitive Apprehended

  • రూ. 13,500 కోట్ల పీఎన్‌బీ కుంభకోణంలో చోక్సీ నిందితుడు
  • జనవరి 2018లో ఇండియా నుంచి పరార్
  • తాజాగా బెల్జియంలో అరెస్ట్.. ధ్రువీకరించిన సీబీఐ

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్ట్ చేసినట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తెలిపింది. రూ. 13,500 కోట్ల పీఎన్‌బీ కుంభకోణం బయటపడటంతో చోక్సీ జనవరి 2018లో ఇండియా నుంచి పరారయ్యాడు. సీబీఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఆయన కోసం తీవ్రంగా గాలిస్తోంది. చోక్సీపై ముంబై కోర్టు మే 23, 2018లో ఒకసారి, జూన్ 15, 2021లో మరోసారి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తాజా అరెస్ట్ నేపథ్యంలో అనారోగ్య కారణాలు చూపుతూ బెయిలు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 

చోక్సీ ప్రస్తుతం భార్య ప్రీతి చోక్సీతో కలిసి బెల్జియంలోని ఆంట్‌వెర్ప్‌లో ఉంటున్నాడు. ప్రీతి చోక్సీ బెల్జియం పౌరురాలు కావడం గమనార్హం. కాగా, మెహుల్ చోక్సీకి బెల్జియంలో తన భార్యతో కలిసి నివసించేందుకు అక్కడి ప్రభుత్వం నవంబర్ 15, 2023లో ‘ఎఫ్ రెసిడెన్సీ కార్డ్’ జారీ చేసింది. యూరోపియన్ యూనియన్ జాతీయులు కానివారు బెల్జియంలో తన భాగస్వామితో కలిసి చట్టబద్ధంగా నివసించేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుంది. అయితే, ఈ కార్డు పొందేందుకు చోక్సీ ఫోర్జరీ చేసిన ధ్రువీకరణ పత్రాలు అందించినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. 

కాగా, డిసెంబర్ 2024లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో మాట్లాడుతూ చోక్సీ సహా పరారీలో ఉన్న నేరగాళ్లకు సంబంధించిన అప్పులను చెల్లించేందుకు రూ. 22,280 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవడమో, అమ్మడమో జరిగినట్టు తెలిపారు.

Mehul Choksi
PNB Scam
Arrest
Belgium
CBI
ED
Fugitive
Diamond Merchant
Preti Choksi
Financial Fraud
  • Loading...

More Telugu News