Mumbai Indians: ఐపీఎల్‌లో ఢిల్లీకి తొలి ఓటమి.. ముంబైకి రెండో గెలుపు

- ఢిల్లీని ముంచిన రనౌట్లు
- కరుణ్ నాయర్ చెలరేగినా తర్వాతి బ్యాటర్లు విఫలం
- వరుస పరాజయాల తర్వాత గెలుపు రుచి చూసిన ముంబై
వరుస పరాజయాల తర్వాత ముంబైకి రెండో విజయం దక్కింది. వరుస విజయాల తర్వాత ఢిల్లీ తొలి ఓటమి చవిచూసింది. ఢిల్లీలో గత రాత్రి ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో ముంబై 12 పరుగుల తేడాతో విజయం సాధించి వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీని రనౌట్లు కొంప ముంచాయి.
ముంబై నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ మరో ఓవర్ మిగిలి ఉండగానే 193 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ కరుణ్ నాయర్ చెలరేగినప్పటికీ తర్వాతి బ్యాటర్లు విఫలమయ్యారు. కరుణ్ 40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగినప్పటికీ కీలక సమయంలో రనౌట్లు ఢిల్లీని దారుణంగా దెబ్బతీశాయి. అశుతోష్ శర్మ (17), కుల్దీప్ యాదవ్ (1), మోహిత్ శర్మ (0) రనౌట్ అయ్యారు. కరుణ్ నాయర్ తర్వాత జట్టులో అభిషేక్ పోరెల్ చేసిన 33 పరుగులే అత్యధికం. ముంబై బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కర్ణ్ శర్మ 3 వికెట్లు తీసుకోగా, మిచెల్ శాంట్నర్ 2 వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. రోహిత్ శర్మ (18) మరోమారు నిరాశ పరిచాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ యాదవ్ 40, తిలక్ వర్మ 59 పరుగులు చేయగా, నమన్ ధిర్ 38 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఐపీఎల్‌లో నేడు లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.