Narendra Modi: అనకాపల్లి బాణసంచా ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

- అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన
- కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం
- 8 మంది మృతి... ఏడుగురికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితులకు ప్రభుత్వం తరపున పూర్తి అండ ఉంటుందని భరోసా ఇచ్చారు.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి రూ. 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు మోదీ ప్రకటించారు. అదేవిధంగా, గాయపడిన వారికి రూ. 50 వేల రూపాయల పరిహారం అందజేస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
"ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం చాలా బాధాకరం. ఈ దుర్ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. బాధితులకు అన్ని విధాలా సహాయం చేయడానికి స్థానిక యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోంది" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన వారుగా గుర్తించారు.