Ramu: ప్రియురాలి భర్తను లేపేయాలనుకున్నాడు... కానీ!

- హత్య కుట్రకు దారితీసిన వివాహేతర సంబంధం
- సుపారీ గ్యాంగ్ తో రూ.20 లక్షలకు ఒప్పందం
- డబ్బు దగ్గర తేడా రావడంతో హత్య చేయకుండా వదిలేసిన నిందితులు
ఖమ్మం జిల్లాలో వివాహేతర సంబంధం ఒక హత్య కుట్రకు దారితీసింది. ఒక వ్యక్తి తన ప్రియురాలి భర్తను అడ్డు తొలగించుకోవడానికి సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ వ్యవహారం చివరికి పోలీసుల దృష్టికి రావడంతో నిందితులంతా కటకటాల పాలయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాము అనే వ్యక్తికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆ మహిళ భర్తను చంపేందుకు ఆమెతో కలిసి రాము కుట్ర పన్నాడు. రూ.20 లక్షలకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందుకోసం రూ.5 లక్షలు అడ్వాన్స్ కూడా చెల్లించాడు.
సుపారీ గ్యాంగ్ బాధితుడిని కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, హత్య చేయడానికి ముందు రాముకు ఫోన్ చేసి మిగతా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాము డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో సుపారీ గ్యాంగ్ అతడిని చంపకుండా వదిలివేశారు. అంతేకాకుండా బాధితుడి వద్ద ఉన్న కొంత డబ్బు, బంగారాన్ని దోచుకున్నారు.
ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు ఒప్పందం చేసుకున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలు, రూ.90 వేల నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది.