తొలి ఏషియన్ బ్యాటర్... టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

  • టీ20 క్రికెట్లో 100 అర్ధసెంచరీలు కొట్టిన తొలి ఆసియా ఆటగాడు కోహ్లీ 
  • ఇప్పటికే ఈ ఘనత సాధించిన డేవిడ్ వార్నర్
  • కోహ్లీ ఖాతాలో మరో రికార్డు
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో రికార్డును జమ చేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా నిలిచాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.

174 పరుగుల లక్ష్య ఛేదనలో వనిందు హసరంగ బౌలింగ్‌లో సిక్సర్ బాది 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

టీ20 క్రికెట్‌లో 100 హాఫ్ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ నిలిచాడు. కోహ్లీ తన 58వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక 50+ స్కోర్లు సాధించిన ఆటగాడిగా వార్నర్ రికార్డును సమం చేశాడు.

వార్నర్ తన ఐపీఎల్ కెరీర్‌లో 184 మ్యాచ్‌లు ఆడి 62 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు సాధించాడు. కోహ్లీ ఇప్పటివరకు 258 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 58 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు చేశాడు.

ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ టీ20 క్రికెట్‌లో 13,000 పరుగులు దాటిన తొలి భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ మైలురాయితో క్రిస్ గేల్, అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్, కీరోన్ పొలార్డ్ సరసన చేరాడు.

కోహ్లీ భారత్ తరఫున 125 టీ20 మ్యాచ్‌లు ఆడి 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత ఏడాది జూన్ 29న కెన్సింగ్టన్ ఓవల్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో 59 బంతుల్లో 76 పరుగులు చేసి భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు.


More Telugu News