Helicopter Crash: హెలికాప్టర్ నిర్వహణ లోపమే సీమెన్స్ సీఈవో కుటుంబం మరణానికి కారణమట

Siemens CEO Family Dies in Helicopter Crash

  • ప్రయాణానికి ముందు తనిఖీలు జరపలేదని నిపుణుల వెల్లడి
  • జీసెస్ నట్టు లూజ్ కావడంతో రెక్కలు ఊడిపోయి కూలిన హెలికాప్టర్
  • ప్రమాదం జరిగిన రోజు ఎనిమిదవసారి గాల్లోకి ఎగిరినట్లు గుర్తించిన అధికారులు

అమెరికాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీమెన్స్ కంపెనీ సీఈవో అగస్టీన్ ఎస్కోబార్ కుటుంబంతో సహా మరణించిన విషయం తెలిసిందే. న్యూయార్క్ పర్యటనలో భాగంగా అగస్టీన్ భార్యాపిల్లలతో కలిసి హెలికాప్టర్ రైడ్ కు వెళ్లారు. అయితే, గాల్లోకి లేచిన కాసేపటికే హెలికాప్టర్ రెక్కలు ఊడిపోయి హడ్సన్ నదిలో కుప్పకూలింది. దీంతో అగస్టీన్ తో పాటు ఆయన భార్యాపిల్లలు మరణించారు. ఈ ప్రమాదంపై అధికారులు చేపట్టిన దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. హెలికాప్టర్ ప్రమాదానికి జీసెస్ నట్టుగా వ్యవహరించే ఓ నట్టు కారణమని ప్రాథమికంగా తేలింది. 

ఈ నట్టు ఊడిపోవడం వల్లే హెలికాప్టర్ రెక్కలు విడిపోయి కూలిందని అధికారులు భావిస్తున్నారు. హెలికాప్టర్ గాల్లోకి లేచే ముందు తప్పనిసరిగా ఈ నట్టును పరీక్షించాల్సి ఉండగా ప్రమాదం జరిగిన రోజు పైలట్ ఈ విషయాన్ని పట్టించుకోలేదని తేలింది. ఆ రోజు సీమెన్స్ కుటుంబాన్ని తీసుకెళ్లడానికి ముందు ఏడుసార్లు హెలికాప్టర్ ప్రయాణించిందని అధికారులు గుర్తించారు. అంతేకాదు, ఆ హెలికాప్టర్‌లో చాలా రిపేర్లు ఉన్నట్లు తేల్చారు. గతేడాది ట్రాన్స్‌మిషన్‌ సమస్య వచ్చిందని ఫెడరల్‌ ఏవియేషన్‌ అధికారులు చెబుతున్నారు.

మార్చి 1వ తేదీన ఇది ఇన్‌స్పెక్షన్‌ను పూర్తి చేసుకుందని వివరించారు. హెలికాప్టర్ ప్రయాణానికి సంబంధించిన రికార్డులు కూడా సదరు కంపెనీ నిర్వహించడంలేదని పేర్కొన్నారు. హెలికాప్టర్ కు అవసరమైన మరమ్మతులు చేయించకపోవడం, ప్రయాణ సమయంలో పైలట్ నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే, దీనిపై అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Helicopter Crash
Hudson River
New York
Helicopter Maintenance
Augustin Escobar
Siemens CEO
Pilot Negligence
Aviation Accident
Federal Aviation Administration
Mechanical Failure
  • Loading...

More Telugu News