UK Police: జూదరుల ఆటకట్టించిన బ్యాట్ మన్.. వీడియో ఇదిగో!

––
దొంగలను, నేరస్థులను పట్టుకోవడానికి పోలీసులు అప్పుడప్పుడు మారువేషాల్లో వెళ్లడం సినిమాల్లో చూస్తుంటాం. యూకే పోలీసులు కూడా ఇదే తరహాలో ఇద్దరు జూదరులను పట్టుకున్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతంలో తిష్ట వేసి జూదం పేరుతో అమాయక పర్యాటకులను దోచుకుంటున్న వారి ఆటకట్టించారు. ఇందుకోసం వారు పిల్లలు ఎంతగానో ఇష్టపడే కార్టూన్ క్యారెక్టర్లు బ్యాట్ మన్, రాబిన్ క్యాస్టూమ్స్ ధరించారు. డ్యాష్ కెమెరాలతో నేరస్థులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కోర్టు ముందు నిలబెట్టారు.
లండన్ లోని పర్యాటక ప్రాంతాల్లో వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జి పేరొందింది. నిత్యం ఈ బ్రిడ్జి పైకి వేలాదిమంది పర్యాటకులు వచ్చివెళుతుంటారు. దీనిని తమకు అనుకూలంగా మలుచుకున్న యూగన్ స్టోకి, కోన్స్టికా ఘెరోగె అనే జూదరులు పర్యాటకులను మోసం చేస్తూ డబ్బు కాజేస్తున్నారు. త్రీ కప్ ఛాలెంజ్, షెల్ గేమ్ అనే ఆటలతో పర్యాటకులను ఆకర్షిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. ఈ విషయం గమనించిన పోలీసులు జూదరుల ఆటకట్టించేందుకు బ్యాట్ మన్, రాబిన్ క్యాస్టూమ్ తో పర్యాటకులను అలరిస్తున్నట్లు బ్రిడ్జి పైకి వెళ్లారు.
సాధారణ దుస్తులలో వెళ్లినా కూడా నేరస్థులు తమను సులభంగా గుర్తించి క్షణాలలో మాయమవుతారనే ఉద్దేశంతో పోలీసులు మారువేషాల్లో వెళ్లారు. దుస్తులలో రహస్యంగా అమర్చిన కెమెరాతో జూదరుల మోసాన్ని రికార్డు చేసి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆపై నిందితులను కోర్టు ముందు నిలబెట్టగా.. జడ్జి వారికి భారీ మొత్తంలో జరిమానా విధించడంతో పాటు జైలుకు పంపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.