Bill Gates: అలా ఉండటం నాకు సరదా: బిల్ గేట్స్

- నిఖిల్ ప్రశ్నలకు ఆసక్తికరంగా గేట్స్ సమాధానాలు
- దాదాపు రెండేళ్లలో ఏఐ అన్నింటినీ మార్చేస్తుందన్న గేట్స్
- ప్రజలు తొందరగా పదవీ విరమణ చేసేయొచ్చని వ్యాఖ్య
ప్రముఖ జీరోధా సంస్థ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గత ఏడాది పాల్గొన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన రెండో భాగాన్ని శుక్రవారం విడుదల చేశారు. ఈ పాడ్‌కాస్ట్‌లో పలు ఆసక్తికర విషయాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి.
భారత్‌లో ఉన్నన్ని రోజులు ఎందుకు బిజీబిజీగా కనిపిస్తారని నిఖిల్ అడిగిన ప్రశ్నకు బిల్ గేట్స్ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. అలా ఉండటం తనకు సరదా అని వ్యాఖ్యానిస్తూ కఠినంగా ఉంటూ పని చేయాలి అనుకుంటూ మనల్ని మనం మోసం చేసుకోకూడదన్నారు.
పెట్టుబడుల కోణంలో అధిక జనాభా మంచిదా కాదా అని నిఖిల్ అడిగిన ప్రశ్నకు గేట్స్ షాకింగ్ సమాధానం ఇచ్చారు. దాదాపు రెండేళ్లలో ఏఐ అన్నింటినీ మార్చేస్తుందని, ప్రజలు తొందరగా పదవీ విరమణ చేసేయొచ్చని అన్నారు. పని వారాలు కూడా తగ్గిపోతాయని పేర్కొన్నారు. ప్రజలు తమ సమయాన్ని ఎలా గడపాలి అనే దానిపై ఆలోచనలు చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తనకు పని లేకపోయినా తాను దాన్ని కల్పించుకుంటున్నానని తెలిపారు. ఏఐతో వచ్చే మార్పుల కోసం ప్రస్తుతం ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారన్నారు. ఈ పాడ్‌కాస్ట్‌లో గేట్స్ సోషల్ సర్వీస్ పైనా చర్చించుకున్నారు.