Mamata Banerjee: వక్ఫ్ చట్టంపై బెంగాల్‌లో ఆందోళనలు.. ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడి

- మాల్డా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనలు
- రోడ్లను దిగ్బంధించి, భద్రతా సిబ్బందిపై రాళ్ల దాడి
- ఘర్షణలో ఇద్దరు, కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్లు తెలిపిన పోలీసులు
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. మాల్డా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు ఆందోళనలు చేపట్టి, రోడ్లను దిగ్బంధించారు. ఈ నిరసనలు ఉద్రిక్తతకు దారితీయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ఘర్షణలలో ఇద్దరు మృతి చెందగా, కాల్పుల్లో మరొకరు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. భద్రతా సిబ్బందిపై నిరసనకారులు రాళ్లతో దాడి చేయడంతో, 110 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. జంగీపూర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తడంతో కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిరసనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే స్పందించారు.