Sunrisers Hyderabad: టాస్ ఓడిన సన్ రైజర్స్... ఈసారి ఛేజింగ్!

- ఈ సీజన్ లో చెత్తగా ఆడుతున్న సన్ రైజర్స్
- ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడి నాలుగింట ఓటమి
- ఇవాళ పంజాబ్ కింగ్స్ తో పోరాటం
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
గత సీజన్ లో వారెవ్వా అనిపించిన సన్ రైజర్స్ హైదరాబాద్, తాజా సీజన్ లో మాత్రం దారుణంగా ఆడుతోంది. ఇప్పటిదాకా 5 మ్యాచ్ లు ఆడి గెలిచింది ఒక్కటే. వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో అన్ని జట్ల కంటే అట్టడుగున కొనసాగుతోంది. ఇవాళ సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో సమరానికి సన్ రైజర్స్ సిద్ధమైంది. అయితే టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టీమ్ ఛేజింగ్ చేయాల్సి వస్తోంది.
ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ టీమ్ లో ఒక మార్పు చేశారు. కమిందు మెండిస్ స్థానంలో శ్రీలంకకే చెందిన ఇషాన్ మలింగనుతుది జట్టులోకి తీసుకున్నారు. అటు, పంజాబ్ కింగ్స్ టీమ్ లో ఎలాంటి మార్పులు లేవని ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు.
గుజరాత్ టైటాన్స్ ను ఓడించిన లక్నో సూపర్ జెయింట్స్
లక్నోలోని వాజ్ పేయి స్టేడియంలో చివరి ఓవర్ వరకు జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. అనంతరం 181 పరుగుల విజయలక్ష్యాన్ని లక్నో జట్టు 19.3 ఓవర్లలో ఛేదించింది. ఈ క్రమంలో 4 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఆయుష్ బదోనీ వరుసగా ఫోర్, సిక్స్ కొట్టి గెలుపును ఖరారు చేశాడు.
లక్నో ఇన్నింగ్స్ లో ఐడెన్ మార్క్రమ్ 58, కెప్టెన్ రిషబ్ పంత్ 21, నికోలాస్ పూరన్ 61, ఆయుష్ బదోనీ 28 (నాటౌట్) రాణించారు. ముఖ్యంగా నికోలాస్ పూరన్ సిక్సర్ల మోత మోగించాడు. 34 బంతులాడిన పూరన్ 1 ఫోర్, 7 సిక్సులు బాదాడు.