Nainar Nagendran: బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్

- బీజేపీ అధ్యక్ష పదవికి నాగేంద్రన్ ఒక్కరి నుంచే నామినేషన్
- కొత్త అధ్యక్షుడిని ప్రకటించిన కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్
- జయలలిత, పన్నీరుసెల్వం ప్రభుత్వాలలో మంత్రిగా పని చేసిన నాగేంద్రన్
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమిళనాడు అధ్యక్షుడిగా తిరునల్వేలి శాసనసభ్యుడు నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఈ ప్రకటన చేశారు. బీజేపీ అధ్యక్ష పదవికి నైనార్ నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. వచ్చే సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు పెట్టుకున్నాయి. ఈ సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్ సమీపం వడివీశ్వరంలో 1960లో నాగేంద్రన్ జన్మించారు. ఆయన మొదట అన్నాడీఎంకేలో ఉండగా, ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2020 జులై నుంచి ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతంలో జయలలిత, పన్నీరుసెల్వం ప్రభుత్వాలలో పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకే, బీజేపీల మధ్య సమన్వయం కుదిర్చేందుకు ఆయన కీలక పాత్ర పోషిస్తారని భావించి పార్టీ అధిష్ఠానం ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైకి జాతీయ స్థాయిలో పదవి లభిస్తుందని ప్రచారం జరుగుతోంది.