Shubman Gill: ఓపెనర్లు అదరగొట్టినా... ఉపయోగించుకోలేకపోయారు!

- ఐపీఎల్ లో నేడు లక్నో సూపర్ జెయింట్స్ × గుజరాత్ టైటాన్స్
- లక్నోలోని వాజ్ పేయి స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో జట్టు
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసిన గుజరాత్
- 12.1 ఓవర్లలోనే 120 పరుగులు జోడించిన గిల్, సుదర్శన్
- తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ విఫలం
లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చినా, ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ నిరాశపరిచారు. దీంతో గుజరాత్ టైటాన్స్ 200 పైచిలుకు స్కోరు చేసే అవకాశం కోల్పోయింది.
లక్నోలోని వాజ్ పేయి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, మొదట బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్ మన్ గిల్ తొలి వికెట్ కు 12.1 ఓవర్లలో 120 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. గిల్ 38 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 60 పరుగులు చేయగా... సాయి సుదర్శన్ 37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 56 పరుగులు చేశాడు.
అయితే వీరిద్దరూ రెండు పరుగుల తేడాతో అవుట్ కావడంతో పరిస్థితి మారిపోయింది. జోస్ బట్లర్ (14), వాషింగ్టన్ సుందర్ (2) స్థాయికి తగ్గట్టు ఆడడంలో విఫలం కావడంతో స్కోరు బోర్డు నిదానించింది. షెర్ఫానే రూథర్ ఫోర్డ్ 22, షారుఖ్ ఖాన్ 11 పరుగులు చేశారు. రాహుల్ తెవాటియా (0) డకౌట్ అయ్యాడు.
సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్ విజృంభణతో డీలాపడిన లక్నో బౌలర్లు... ఆ తర్వాత కుదురుగా బౌలింగ్ చేసి గుజరాత్ టైటాన్స్ ను కట్టడి చేశారు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, రవి బిష్ణోయ్ 2, దిగ్వేష్ రాఠీ 1, అవేష్ ఖాన్ 1 వికెట్ తీశారు.