నేను పెద్ద‌గా చ‌దువుకోలేదు.. నాకు ఇంగ్లీష్ రాదు: మహ్మద్ రిజ్వాన్

  • త‌న‌కు ఇంగ్లీష్ రాద‌ని సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ట్రోలింగ్‌పై స్పందించిన క్రికెట‌ర్‌
  • తాను ట్రోలింగ్‌ను ప‌ట్టించుకోన‌ని వెల్ల‌డి
  • త‌న నుంచి మేనేజ్‌మెంట్ క్రికెట్ కోరుకుంటోంద‌ని.. ఇంగ్లీష్ కాద‌న్న పాక్ కెప్టెన్
పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు వైట్-బాల్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తన స్పోకెన్ ఇంగ్లీష్ విష‌య‌మై ఇటీవ‌ల త‌ర‌చూ  ట్రోలింగ్‌లకు గురవుతున్న విష‌యం తెలిసిందే. మ్యాచ్ కు ముందు, మ్యాచ్ త‌ర్వాత అత‌డు మీడియాతో మాట్లాడే ఇంగ్లీష్ వీడియో క్లిప్స్‌ను కొంద‌రు సోష‌ల్ మీడియాలో పెట్టి వైర‌ల్ చేస్తుంటారు. దాంతో రిజ్వాన్ ఇంగ్లీష్‌పై విప‌రీత‌మైన  ట్రోలింగ్స్ వ‌స్తుంటాయి. 

ఇక నిన్న‌టి నుంచి పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ముల్తాన్ సుల్తాన్స్ కెప్టెన్ అయిన‌ రిజ్వాన్ మీడియాతో మాట్లాడారు. ఆ స‌మ‌యంలో త‌న‌కు ఇంగ్లీష్ రాద‌ని సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ట్రోలింగ్‌పై స్పందించాడు. తాను ట్రోలింగ్‌ను ప‌ట్టించుకోన‌న్నాడు. తాను పెద్ద‌గా చ‌దువుకోలేద‌ని, త‌న‌కు ఇంగ్లీష్ రాద‌ని చెప్పుకొచ్చాడు. 

"నా చదువును పూర్తి చేయనందుకు నేను చింతిస్తున్నాను. అందుకే నాకు ఇంగ్లీష్ రాదు. పాకిస్థాన్ జ‌ట్టుకు కెప్టెన్‌గా  ఉండి కూడా నేను ఇంగ్లీష్ మాట్లాడ‌లేక‌పోతున్నందుకు సిగ్గుపడటం లేదు. నా నుంచి మేనేజ్‌మెంట్ క్రికెట్ కోరుకుంటోంది. ఇంగ్లీష్ కాదు. ఒక‌వేళ ఇంగ్లీష్ కావాలంటే క్రికెట్‌ను వ‌దిలి ప్రొఫెస‌ర్ అయ్యుండేవాడిని" అని రిజ్వాన్ తెలిపాడు.




More Telugu News