MS Dhoni: ధోనీ ఎల్ బీడబ్ల్యూ.. సోషల్ మీడియాలో అభిమానుల రచ్చ

- థర్డ్ అంపైర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు
- బ్యాట్ అంచును తాకినట్లు స్పైక్స్ కనిపించినా ఔట్ ఇవ్వడంపై అభిమానుల ఫైర్
- థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఈ సీజన్ ఏమాత్రం కలిసిరావడంలేదు. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ లలో సీఎస్కే తొలి మ్యాచ్ మినహా వరుసగా ఐదింట్లో ఓటమి చవిచూసింది. కెప్టెన్సీ పగ్గాలు మళ్లీ ధోనీ చేతికి వచ్చినా ఆ జట్టు రాత మారలేదు. చెన్నైలో శుక్రవారం రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే ఘోర పరాజయం చవిచూసింది. అయితే, ఈ మ్యాచ్ లో కెప్టెన్ ధోని ఎల్ బీడబ్ల్యూ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని సీఎస్కే అభిమానులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. రివ్యూలో బ్యాట్ కు బంతి తాకినట్లు స్పైక్స్ కనిపించినా ఔట్ ఎలా ఇస్తారని మండిపడుతున్నారు.
ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. సునీల్ నరైన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. నరైన్ అప్పీల్ చేయగానే ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంతో ధోనీ వెంటనే రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి బ్యాట్ ను తాకి ఆపై ధోనీ ప్యాడ్ ను తాకినట్లు కనిపించింది. స్వల్పంగా స్పైక్స్ కనిపించినా థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చేశాడు. ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘అల్ట్రాఎడ్జ్‌లో వచ్చిన స్పైక్స్‌ను థర్డ్ అంపైర్ పరిగణనలోకి తీసుకోలేదు. బ్యాట్‌కు బంతి చాలా దగ్గరగా వెళ్లినట్లుంది. అక్కడ కాస్త స్పైక్స్ కనిపించాయి. కానీ, థర్డ్ అంపైర్ ఎన్నో ఫ్యాక్టర్స్‌ను పరిశీలించినట్లు ఉంది. పాదం కదలిక జరిగినప్పుడూ స్పైక్స్ వస్తుంటాయని నిపుణల మాట’ అని బౌచర్ చెప్పాడు.