Illegal Immigrants: 6 వేల మందిని రికార్డుల్లో చంపేసిన ట్రంప్ సర్కారు.. కారణం ఇదేనట!

- తాత్కాలిక పర్మిట్ తో అమెరికాలోకి వచ్చి తిరిగి వెళ్లకపోవడంతో నిర్ణయం
- పొమ్మన లేక కాదు వలసదారులను పొమ్మనే పొగబెట్టిన ట్రంప్
- రికార్డుల్లో మరణించినట్లు నమోదు.. సోషల్ సెక్యూరిటీ నెంబర్ రద్దు
- తమకు తాముగా అమెరికా విడిచి వెళ్లేలా చేయడమే ట్రంప్ ఉద్దేశం
అమెరికాలో నివసిస్తున్న 6 వేల మంది వలసదారులను ట్రంప్ ప్రభుత్వం రికార్డుల్లో చంపేసింది. వారంతా జీవించి ఉన్నప్పటికీ అధికారులు మాత్రం రికార్డుల్లో మరణించినట్లు అప్ డేట్ చేశారు. దీంతో వారి సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఆటోమేటిక్ గా రద్దవుతుంది. అమెరికాలో సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది తప్పనిసరి. అమెరికా పౌరులతో పాటు తాత్కాలికంగా ఆశ్రయం కోసం వచ్చిన వారికీ ప్రభుత్వం ఈ నెంబర్ ను కేటాయిస్తుంది. ఈ సోషల్ సెక్యూరిటీ నెంబర్ లేదంటే వారు జీవించి ఉన్నా కూడా మరణించినట్లే పరిగణించబడతారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందే అవకాశం వారికి ఉండదు. అంతేకాదు, ఉద్యోగం కానీ, ఏదైనా చిన్నపాటి పని కానీ చేసుకునే వీలు ఉండదు. వలసదారులు తమకు తామే అమెరికాను విడిచి వెళ్లిపోయేలా చేసేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పొమ్మన లేక పొగ బెట్టినట్లనేది తెలుగు సామెత కానీ ట్రంప్ సర్కారు మాత్రం పొమ్మనే పొగ పెట్టినట్లు ఇలా రికార్డుల్లో వలసదారులను చంపేసింది.
బైడెన్ ప్రభుత్వం అమలు చేసిన పలు కార్యక్రమాల ద్వారా సుమారు 90 వేల మంది వలసదారులు అమెరికాలో అడుగుపెట్టారని అధికారులు తెలిపారు. వారందరూ తాత్కాలిక ఆశ్రయం కోరి వచ్చినవారేనని వివరించారు. అయితే, గడువు ముగిసినా వారు స్వదేశానికి తిరిగి వెళ్లలేదని, అమెరికాలోనే ఉంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారందరినీ వెతికి పట్టుకుని వెనక్కి పంపడం శ్రమతో కూడుకున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రికార్డుల్లో వారు చనిపోయినట్లు నమోదు చేస్తే సోషల్ సెక్యూరిటీ నెంబర్ రద్దయి వారంతట వారే అమెరికాను వీడుతారని అధికారులు భావించారు. ఇందులో భాగంగానే తాజాగా 6 వేల మంది వలసదారులను రికార్డుల్లో మరణించినట్లుగా నమోదు చేశారు.