Anchor Ravi: క్షమాపణ కోరుతూ వీడియో రిలీజ్ చేసిన యాంకర్ రవి

- ఓ టీవీ షోలో వివాదాస్పద స్కిట్ చేసిన యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ టీమ్
- గట్టి వార్నింగ్ లు ఇచ్చిన హిందుత్వ సంఘాలు
- అది స్పూఫ్ మాత్రమేనన్న రవి
- ఎవరినీ బాధించాలన్న ఉద్దేశంతో చేసింది కాదని వివరణ
- మరోసారి ఇటువంటివి చేయబోమని స్పష్టీకరణ
శివాలయాల్లో గర్భగుడి ముందు నందీశ్వురుడు ఉండడం... ఆ నంది కొమ్ముల్లోంచి చూస్తే శివయ్య కనిపించడం... భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. అయితే ప్రముఖ యాంకర్ రవి హోస్ట్ గా ఉన్న ఓ టీవీ షోలో సుడిగాలి సుధీర్ టీమ్ రూపొందించిన స్కిట్ వివాదాస్పదం అయింది.
ఈ స్కిట్ లో... నంది కొమ్ముల్లోంచి చూస్తే దేవుడికి బదులు ఓ అమ్మాయి కనిపిస్తుంది. దాంతో యాంకర్ రవిపైనా, సుడిగాలి సుధీర్ పైనా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హిందూ సంఘాలు ఇప్పటికే గట్టి వార్నింగ్ లు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో యాంకర్ రవి స్పందించారు. హిందువులకు క్షమాపణలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
"అందరికీ నమస్కారం అండీ. ఇటీవల నేను, కొందరు ఆర్టిస్టులు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ అనే కార్యక్రమం చేశాం. ఇందులో మేం ఒక స్పూఫ్ చేశాం. ఎవరినో బాధపెట్టాలనే ఉద్దేశంతో కావాలని చేసింది కాదు. ముఖ్యంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయాలన్నది మా ఉద్దేశం కాదు. ఇది ప్రత్యేకంగా రైటర్ ను పెట్టుకుని రాయించిన స్కిట్ కాదు... ఇది ఒక సినిమా స్పూఫ్. ఒక సినిమాలోని సీన్ ను మేం స్టేజిపై ప్రదర్శించాం. అయితే దీని వల్ల చాలామంది హిందువులు బాధపడ్డారని తెలిసింది. అలా చేయడం తప్పు అని చాలా కాల్స్ వస్తున్నాయి. అందుకే ఇంకోసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్త పడతాం. జై శ్రీరామ్... జై హింద్" అంటూ యాంకర్ రవి తన వీడియోలో పేర్కొన్నారు.