K Ponmudy: మహిళలపై వ్యాఖ్యలు.. తమిళనాడు మంత్రిపై ఖుష్బూ, కనిమొళి, గాయని చిన్మయి ఆగ్రహం

- ఇలాంటి వ్యాఖ్యలను మీ ఇంట్లోని మహిళలు అంగీకరిస్తారా అని ఖుష్బూ ప్రశ్న
- ఇలాంటి వారిని ఆ భగవంతుడే శిక్షిస్తాడన్న గాయని చిన్మయి
- కారణమేదైనా మహిళలపై మంత్రి వ్యాఖ్యలు సరికాదన్న కనిమొళి
మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ తమిళనాడు మంత్రి కె. పొన్ముడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. అందులో ఆయన సెక్స్ వర్కర్లు, కస్టమర్ల మధ్య సంభాషణ ఇలా ఉంటుందంటూ అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించారు. ఇదంతా జోక్ అని చివరలో చెప్పారు. అయితే ఆయన మాట్లాడిన తీరు మహిళలను కించపరిచేలా ఉందని విమర్శలు వస్తున్నాయి.
ప్రముఖ గాయని చిన్మయి, నటి ఖుష్బూతో పాటు పలువురు ప్రముఖులు మంత్రి తీరును ఖండించారు. సొంత పార్టీ నేతలు కూడా మంత్రి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో డీఎంకే చర్యలకు సిద్ధమైంది.
మీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు అర్థమేంటో నా కంటే మీకే బాగా తెలుసని స్టాలిన్‌ను ఉద్దేశించి ఖుష్బూ అన్నారు. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలను మీ ఇంట్లోని మహిళలు అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి వారిని ఆ భగవంతుడే శిక్షిస్తాడని గాయని చిన్మయి పేర్కొన్నారు.
మంత్రి వ్యాఖ్యలను సొంత పార్టీ ఎంపీ కనిమొళి కూడా ఖండించారు. పొన్ముడి చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదన్నారు. కారణమేదైనా మహిళలపై మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించాలని అన్నారు.
ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పొన్ముడిని డీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పించింది. గతంలోనూ ఆయన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సు సౌకర్యం గురించి మాట్లాడుతూ మహిళలను వలసదారులతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.