BRS: రజతోత్సవ సభ కోసం హైకోర్టుకు బీఆర్ఎస్... విచారణ ఈ నెల 17కు వాయిదా

- వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి నిరాకరణ
- సభకు అనుమతి ఇచ్చేలా ఆదేశించాలంటూ బీఆర్ఎస్ నేతల పిటిషన్
- 17వ తేదీ నాటికి కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 17వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. సభకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు తమ పిటిషన్‌లో కోరారు.
ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సభ నిర్వహిస్తామని బీఆర్ఎస్ పార్టీ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వరంగల్ పోలీస్ కమిషనర్, కాజీపేట ఏసీపీలను బీఆర్ఎస్ ప్రతివాదులుగా చేర్చింది. హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
కౌంటర్ దాఖలు చేయడానికి హోంశాఖ తరఫున ఈ నెల 21వ తేదీ వరకు సమయం కోరారు. అయితే, సభకు ఏర్పాట్లు చేసుకోవలసి ఉన్నందున ఈ నెల 17వ తేదీ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.