ఢిల్లీ చేతిలో ఓట‌మి... సొంత మైదానంలో ఆర్‌సీబీ అవాంఛిత‌ రికార్డు!

  • నిన్న చిన్న‌స్వామి స్టేడియంలో డీసీ, ఆర్‌సీబీ మ్యాచ్
  • హోం గ్రౌండ్‌లో బెంగ‌ళూరును 6 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఢిల్లీ
  • త‌ద్వారా సొంత మైదానంలో అత్య‌ధిక సార్లు (45) ఓడిన జ‌ట్టుగా ఆర్‌సీబీ చెత్త రికార్డు
  • ఇంత‌కుముందు ఢిల్లీ (44) పేరిట ఈ అవాంఛిత రికార్డు
గురువారం ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ)తో హోం గ్రౌండ్ చిన్న‌స్వామి స్టేడియంలో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) ఓట‌మి చ‌విచూసిన విష‌యం తెలిసిందే. 6 వికెట్ల తేడాతో బెంగ‌ళూరును సొంత మైదానంలోనే ఢిల్లీ చిత్తు చేయ‌డం గ‌మనార్హం. 

లోక‌ల్ బాయ్ కేఎల్ రాహుల్ 53 బంతుల్లోనే అజేయంగా 93 పరుగులు చేసి డీసీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. లక్ష్య ఛేదనలో 58 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీక‌లోతు కష్టాల్లో పడిన జట్టును రాహుల్ ఒంటిచెత్తో విజ‌యాన్ని అందించాడు.  

ఈ ప‌రాజ‌యంతో ఆర్‌సీబీ ఖాతాలో ఓ అవాంఛిత రికార్డు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు డీసీ పేరిటే ఉన్న ఆ రికార్డు ఇప్పుడు ఆర్‌సీబీ పేరిట న‌మోదైంది. చిన్న‌స్వామి స్టేడియంలో అత్య‌ధిక సార్లు (45) ఓడిన జ‌ట్టుగా నిలిచింది. త‌ద్వారా ఒకే వేదిక‌పై అత్య‌ధిక ప‌రాజ‌యాలు పొందిన తొలి జ‌ట్టుగా బెంగ‌ళూరు చెత్త రికార్డును న‌మోదు చేసింది. 

అంత‌కుముందు ఢిల్లీలో డీసీ 44 మ్యాచుల్లో ఓడింది. ఇప్పుడు 45 ఓట‌ముల‌తో డీసీని అధిగ‌మించి అవాంఛిత రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది ఆర్‌సీబీ. భారీ మ‌ద్ద‌తు ఉండే సొంత మైదానంలోనే ఇలా ప‌రాజ‌యాలు ఎదుర‌వ‌డంపై అభిమానులు మండిప‌డుతున్నారు.    

ఆర్‌సీబీ, డీసీ త‌ర్వాత కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్)- 38, ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ)- 34, పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)- 30 ఉన్నాయి. ఈ జ‌ట్లు కూడా త‌మ సొంత మైదానాల్లోనే అత్య‌ధిక‌సార్లు ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం. 


More Telugu News