Harish Rao: కంచ గచ్చిబౌలి భూముల్లో అరుదైన పక్షులు, జంతువులు, చెట్లు ఉన్నాయి: హరీశ్ రావు

- చెట్లను కొట్టివేయాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలన్న హరీశ్ రావు
- ఒక్కో చెట్టుకు రూ. 400 డిపాజిట్ చేశాకే కొట్టాలన్న హరీశ్ రావు
- జీహెచ్ఎంసీ 2011లో లక్ష చెట్లను నాటిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కంచ గచ్చిబౌలిలోని భూముల్లో అరుదైన పక్షులు, జంతువులు, వృక్షాలు ఉన్నాయని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిశీలించేందుకు పర్యావరణ, అటవీ శాఖలు కేంద్ర సాధికారిక కమిటీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)ను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. ఈ నేపథ్యంలో కమిటీతో హరీశ్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం సమావేశమైంది. ఈ భూముల వ్యవహారానికి సంబంధించిన డాక్యుమెంట్లు, విజువల్స్‌తో కూడిన నివేదికను బీఆర్ఎస్ బృందం కమిటీకి అందజేసింది.
అనంతరం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ, వాల్టా చట్టం ప్రకారం చెట్లు కొట్టివేయాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని అన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, అటవీ శాఖ అనుమతులు ఇచ్చిన తర్వాతే చెట్లను తొలగించాల్సి ఉంటుందని తెలిపారు. ఒక్కో చెట్టుకు రూ. 400 డిపాజిట్ చేశాకే నరకాలని పేర్కొన్నారు. అటవీ శాఖ పట్టించుకోకపోవడం వల్లే కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లను నరికేశారని ఆయన విమర్శించారు.
2011లో కంచ గచ్చిబౌలి భూముల్లో జీహెచ్ఎంసీ లక్ష మొక్కలు నాటిందని ఆయన గుర్తు చేశారు. ఆ భూముల్లో మన్మోహన్ సింగ్ కూడా మొక్కలు నాటారని తెలిపారు. ఇక్కడ ఉన్న అరుదైన వృక్షాలు, జంతువులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.
ఈ భూములను తాకట్టు పెట్టి గత ఏడాది రూ. 10 వేల కోట్ల రుణం తెచ్చారని, మధ్యవర్తికి రూ. 170 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. మధ్యవర్తికి ఇచ్చిన డబ్బు విషయం అసెంబ్లీలో కూడా చెప్పామని తెలిపారు. కంచ గచ్చిబౌలి భూములు హెచ్‌సీయూవేనని ఆయన వ్యాఖ్యానించారు. ఫార్మా సిటీ కోసం 14 వేల ఎకరాల భూమిని సేకరించారని, దానిని అభివృద్ధి చేయాలని సూచించారు.