Ambati Rambabu: పులివెందుల ఎమ్మెల్యే అని జగన్ ను కించపరుస్తున్నారు: అంబటి రాంబాబు

- జగన్ ను సైకో, రౌడీ అంటున్నారని మండిపాటు
- రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన
- జగన్ కు సరైన సెక్యూరిటీ ఇవ్వడం లేదని ఆగ్రహం
టీడీపీ నేతలపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్ ను సైకో, రౌడీ అంటున్నారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కోర్టుకు వెళితే తప్ప కేసులు నమోదు చేయడం లేదని అన్నారు. కేసులు నమోదు చేయాలని తాను అడిగితే... తనపైనే కేసులు పెట్టారని ఎద్దేవా చేశారు. కొంతమంది పోలీసు అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్ లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకోలేదని... 'చీటర్' అనే బిరుదు ఆయనకు సరిపోతుంది అన్నారు.
జగన్ ను పులివెందుల ఎమ్మెల్యే అని హోం మంత్రి అనిత కించపరుస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. 11 సీట్లు ఉన్న జగన్ కు 1 ప్లస్ 1 సెక్యూరిటీ ఇస్తామని అంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందని తెలిపారు. జగన్ హెలికాప్టర్ వద్దకు వచ్చిన వందలాది మంది మీ వాళ్లు కాదా? అని ప్రశ్నించారు. జగన్ కు సరైన సెక్యూరిటీ ఇవ్వడం లేదని అన్నారు.