Jagan Mohan Reddy: జగన్ లా అండ్ ఆర్డర్ కు ముప్పులా తయారవుతున్నారు.... అమిత్ షాకు లేఖ రాసిన టీడీపీ ఎంపీ

- పోలీసుల నైతికతను దెబ్బతీసేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్న టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
- జగన్ వ్యవహారశైలి బెయిల్ షరతులను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యలు
- రాప్తాడు పర్యటనలో పోలీసులపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదివరకే ఏపీలో వైఎస్ జగన్ హయాంలో జరిగిన లిక్కర్ వ్యాపారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని లోక్ సభలో ప్రస్తావించడంతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి లిక్కర్ స్కామ్ వివరాలను అందజేశారు.
తాజాగా పోలీసు అధికారులపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పులా జగన్ తయారవుతున్నారని లావు తీవ్రంగా విమర్శించారు. జగన్ వ్యాఖ్యలు పోలీసుల నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అన్నారు.
బెయిల్‌పై ఉన్న జగన్ వ్యవస్థలను బెదిరించేలా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆయన వ్యవహార శైలి బెయిల్ షరతులను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. జగన్ ప్రసంగాలు శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లేలా, ప్రజాస్వామ్యానికి హాని కలిగించేలా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.
ఇటీవల సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గ పర్యటనలో పోలీసులపై జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బట్టలూడదీసి కొడతామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిఫామ్ ఊడదీసి ఉద్యోగాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలను అధికార టీడీపీ, మరోపక్క పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా తప్పుబడుతోంది.