Sanju Samson: గుజరాత్ చేతిలో ఓడిన తర్వాత రాజస్థాన్ కెప్టెన్‌కు షాక్

- గత రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన రాజస్థాన్
- స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ సంజు శాంసన్‌కు రూ. 24 లక్షల జరిమానా
- రాజస్థాన్ జరిమానా ఎదుర్కోవడం ఈ సీజన్‌లో ఇది రెండోసారి
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్‌కు బీసీసీఐ భారీ షాకిచ్చింది. గత రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా సంజు శాంసన్‌కు బీసీసీఐ రూ. 24 లక్షల జరిమానా విధించింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ విఫలమైన రాజస్థాన్ 58 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. స్లో ఓవర్ రేట్ కారణంగా రాజస్థాన్ జరిమానా ఎదుర్కోవడం ఈ సీజన్‌లో ఇది రెండోసారి.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించిన రియాన్ పరాగ్ స్లో ఓవర్ రేట్ కారణంగా రూ. 12 లక్షల జరిమానా ఎదుర్కొన్నాడు. తాజాగా, జట్టులోని మిగతా సభ్యులకు మ్యాచ్ ఫీజులో 25 శాతం కానీ, రూ. ఆరు లక్షల చొప్పున కానీ బీసీసీఐ జరిమానా విధించింది. వీటిలో ఏది తక్కువైతే అది చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ రాణించలేకపోయామని, జట్టు ఓటమికి అదే కారణమని సంజు శాంసన్ అంగీకరించాడు. బౌలింగ్‌లో 15 నుంచి 20 పరుగులు అధికంగా ఇచ్చామని పేర్కొన్నాడు. అలాగే, అదే సమయంలో బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యామన్నాడు. హెట్మెయిర్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ విజయంపై ఆశలు పెంచిన వేళ తాను ఔట్ కావడంతో జట్టు ఓటమి పాలైందని సంజూ వివరించాడు.