Sai Sudharsan: సాయి సుదర్శన్ విజృంభణ... గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు

- ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్ × గుజరాత్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 217 పరుగులు చేసిన టైటాన్స్
ఓపెనర్ సాయి సుదర్శన్ వీరవిహారం చేయడంతో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 217 పరుగులు చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ కు దిగింది.
ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ శుభ్ మన్ గిల్ (2) త్వరగా అవుటైనప్పటికీ, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ సాయి సుదర్శన్... జోస్ బట్లర్ తో కలిసి దూకుడుగా ఆడాడు. సాయి సుదర్శన్, బట్లర్ రెండో వికెట్ కు 80 పరుగులు జోడించారు. సాయి సుదర్శన్ 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 82 పరుగులు చేశాడు. మైదానం నలుమూలలా షాట్లు కొట్టిన సాయి సుదర్శన్ తన పవర్ హిట్టింగ్ తో అలరించాడు.
బట్లర్ 36, షారుఖ్ ఖాన్ 36, రాహుల్ తెవాటియా 24 (నాటౌట్) పరుగులతో రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 2, మహీశ్ తీక్షణ 2, జోఫ్రా ఆర్చర్ 1, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు.