Air India: ఎయిరిండియా విమానంలో ప్రయాణికుడి దుశ్చర్య

- ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళుతున్న విమానం
- తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన బిజినెస్ క్లాస్ ప్రయాణికుడు
- అంతర్గత కమిటీ ఏర్పాటు చేసిన ఎయిరిండియా
- కమిటీ నివేదిక ప్రకారం చర్యలు
ఎయిర్ ఇండియా విమానంలో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళుతున్న విమానంలో బిజినెస్ క్లాస్ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. విమానం ల్యాండింగ్ కు కొద్దిసేపటి ముందు ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనను ఎయిర్ ఇండియా ధృవీకరించింది. సిబ్బంది నిబంధనల ప్రకారమే వ్యవహరించారని తెలిపింది. బాధితుడు ఫిర్యాదు చేయడానికి నిరాకరించడంతో, అంతర్గత కమిటీ తదుపరి చర్యలు తీసుకోనుంది.
వివరాల్లోకి వెళితే.. ఎయిర్ ఇండియాకు చెందిన AI-2336 విమానం ఢిల్లీ నుంచి బ్యాంకాక్ బయలుదేరింది. విమానంలో బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్న వ్యక్తి మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. విమాన సిబ్బంది వెంటనే స్పందించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రయాణికుడిని హెచ్చరించడంతో పాటు, బ్యాంకాక్ లో అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వీలుగా బాధితుడికి సహాయం చేయడానికి సిబ్బంది ముందుకు వచ్చారని, అయితే ఆ ప్రయాణికుడు ఫిర్యాదు చేసేందుకు నిరాకరించారని పేర్కొన్నారు.
ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఎయిర్ ఇండియా అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా సంబంధిత ప్రయాణికుడిపై చర్యలు తీసుకోనున్నారు. ఇలాంటి సంఘటనే 2022 నవంబర్లో ఎయిర్ ఇండియా విమానంలో జరిగింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగింది. ఆ వ్యక్తిని ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించకుండా కొంతకాలం పాటు నిషేధం విధించారు. అంతేకాకుండా, ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలో, ఎయిర్ ఇండియా తన విమానాల్లో మద్యం విధానాన్ని కఠినతరం చేసింది. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ప్రయాణికుల ప్రవర్తనపై నిఘా ఉంచాలని ఆదేశించింది. ముఖ్యంగా ఢిల్లీ-థాయిలాండ్ మధ్య ప్రయాణించే విమానాల్లో ప్రయాణికులు మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సిబ్బంది గుర్తించారు. బడ్జెట్ ఎయిర్ లైన్స్ లో మద్యం అమ్మకాలను పరిమితం చేశారు. ప్రయాణికులు మద్యం సేవించిన తర్వాత నియంత్రణలో ఉంటేనే సిబ్బంది మరింత మద్యం విక్రయించాలని అధికారులు సూచించారు.