Revanth Reddy: రాహుల్ తెలంగాణకు వచ్చి హామీలు ఇచ్చారు... వాటిని అమలు చేసి చూపించాం: రేవంత్ రెడ్డి

- అహ్మదాబాద్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
- బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపు
- గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళతామన్న రేవంత్ రెడ్డి
తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా కుల గణనతో సహా పలు హామీలు ఇచ్చారని, ఆయన ఇచ్చిన మాట ప్రకారం వాటిని తమ రాష్ట్రంలో అమలు చేసి చూపించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
రానున్న రోజుల్లో బీజేపీని ఓడించే బాధ్యతను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తీసుకోవాలని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసేందుకు సబర్మతి ఒడ్డున సమావేశమయ్యామని, గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
రాహుల్ గాంధీ కులగణన, రైతు రుణమాఫీ, నిరుద్యోగ నిర్మూలన, మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు తెలంగాణలో పాదయాత్ర చేసిన సమయంలో చెప్పారని గుర్తు చేస్తూ, వాటిని అమలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.