Kollu Ravindra: జే బ్రాండ్లతో లివర్, కిడ్నీ సమస్యలతో వేల మంది ప్రాణాలు కోల్పోయారు: కొల్లు రవీంద్ర

- జగన్ లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకున్నారన్న రవీంద్ర
- డిస్టిలరీలు, మద్యం షాపులను హస్తగతం చేసుకున్నారని మండిపాటు
- నూతన ఎక్సైజ్ పాలసీకి తాము శ్రీకారం చుట్టామని వెల్లడి
ఎక్సైజ్ వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్... లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకున్నారని చెప్పారు. కొత్త ఎక్సైజ్ పాలసీ పేరుతో వ్యవస్థను విచ్ఛిన్నం చేశారని దుయ్యబట్టారు. తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీలో నిర్వహించిన ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
డిస్టిలరీల దగ్గర నుంచి మద్యం షాపుల వరకు మొత్తం హస్తగతం చేసుకున్నారని రవీంద్ర మండిపడ్డారు. జే బ్రాండ్ మద్యంతో లివర్, కిడ్నీ సమస్యలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
కూటమి ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీకి శ్రీకారం చుట్టిందని చెప్పారు. డ్రా నిర్వహించి అత్యంత పారదర్శకంగా మద్యం దుకాణాలను కేటాయించామని తెలిపారు. గంజాయి నిర్మూలనకు ఈగిల్ టీమ్ లను ఏర్పాటు చేశామని చెప్పారు.